Madhya Pradesh : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించి 11 మంది మరణించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, సాగర్ జిల్లాలోని, బందా తహసీల్ పరిధిలో ఉన్న నౌరాజ్, గూగ్రా ఖర్ద్ అనే గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి జరిగింది. రెండు గ్రామాలకు చెందిన కొంతమంది శనివారం సాయంత్రం మద్యం సేవించారు. తర్వాత రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుఝాములోపు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతూ వచ్చాయి.
తలనొప్పి, వాంతులు, శ్వాస సంబంధిత సమస్యలకు గురయ్యారు. వెంటనే బాధితుల్ని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రి తరలించారు. అయితే, వారిలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది. కల్తీ మద్యం సేవించిన వారిలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు జిల్లా సివిల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే సాగర్ కమిషనర్, ఐజీ, కలెక్టర్ సహా ఇతర అధికారులు ఆయా గ్రామాలకు చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
గడిచిన 48 గంటల్లో ఎవరైనా మద్యం సేవించి ఉండి, వారికి తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు స్థానికులకు సూచించారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలని, తగిన పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. అలాగే, ఈ ప్రాంతంలో ఉన్న ఆరు లిక్కర్ షాపులను అధికారులు సీజ్ చేశారు. స్థానికులు ఎవరూ ఇక్కడి మద్యం సేవించరాదని సూచించారు. కల్తీ మద్యంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించాల్సిందిగా సంబంధిత మంత్రులను ఆదేశించినట్లు చెప్పారు. ఇలా కల్తీ మద్యం తయారు చేసేవారిపై, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.