Group-1 | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓ వైపు హైకోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తూనే మరో వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఒక మారు జీవో-29పై సుప్రీంకోర్టుకెళ్లిన అభ్యర్థులు మళ్లీ ఫైనల్ ‘కీ’పై సైతం తలుపుతట్టారు. ఫైనల్ కీలో అనేక తప్పులున్నాయని, తమ అభ్యంతరాలను టీజీపీఎస్సీ పట్టించుకోవడంలేదని, న్యాయం చేయాలని కోరుతూ నిరుద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరఫున అడ్వకేట్ మోహిత్‌రావు పిటిషన్ వేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.
గ్రూప్-1 ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేయగా 1,712 మంది అభ్యర్థుల నుంచి 6,417 అభ్యంతరాలొచ్చాయి. నిపుణుల కమిటీ సూచనల మేరకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ప్రశ్న నెంబర్ 56, 59ని తొలగించారు. ప్రశ్న నెంబర్ 115కు సరైన సమాధానం ఆప్షన్ 2 నుంచి 1 సరైనది సమాధానంగా మార్చారు. అయితే అభ్యర్థులు మొత్తం 13 ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు లేవదీశారు. ప్రశ్న నెంబర్లు 35, 41, 45, 59, 64, 66, 67, 79, 95, 106, 116, 119, 139పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని కోర్టుముందుంచారు. ‘కీ’పై విచారణ సమయంలో టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదని హైకోర్టుకు తెలిపింది. గూగుల్, వికీపీడియాను ప్రమాణికంగా తీసుకుని ‘కీ’ని ఖరారుచేసినట్టు టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ సంస్థ ముద్రించిన పుస్తకాలు ప్రమాణికంకాదంటే ఎలా..? అంటూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో 15 కేసులు..
గ్రూప్-1పై దాదాపు 15 కేసులు హైకోర్టులో ఉన్నాయి. ఈ కేసుల్లో కొన్ని డివిజన్ బెంచ్, మరికొన్ని సింగిల్ బెంచ్ విచారణలో ఉన్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు జీవో-29ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టులోని కేసు లు తేలే వరకు గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేయవద్దని, హైకోర్టు ఈ కేసులను త్వరగా విచారించాలని ఆదేశాలిచ్చింది. ఈ గురువారం గ్రూప్-1పై గల ఐదు పిటిషన్లను విచారించిన హైకోర్టు 26న తుది విచారణ జరుపుతామని ప్రకటించింది. అభ్యర్థులు ఒక వైపు హైకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే, మరో వైపు సుప్రీంకోర్టులోనూ పోరాటానికి రెడీ అయ్యారు. జీవో-29 సహా ఫైనల్ ‘కీ’పై గల కేసుల్లో న్యాయం తమవైపే ఉందని, రెండు కోర్టుల్లోనూ తమకే అనుకూలంగా తీ ర్పువస్తుందని అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.