Mission Chanakya Survey | కారు.. సారు.. సర్కారు’.. గ్రేటర్లో అయినా, ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో అయినా జనానిది ఒకేమాట. తెలంగాణ ఎన్నికలపై శాస్త్రీయంగా నిర్వహిస్తున్న సర్వేల్లో ప్రజలనాడి స్పష్టంగా వెల్లడవుతున్నది. తాజాగా మిషన్ చాణక్య సర్వేలోనూ ఇదే విషయం సుస్పష్టమైంది. నా రాష్ట్రం- నా ఓటు – నా నిర్ణయం అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నట్లు వెల్లడైంది. అన్ని వయసుల ఓటర్లలోనూ అధిక శాతం మంది బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 44.62 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. అదే కాంగ్రెస్ 32.71 శాతానికే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీకి 17.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వేలో తెలిసింది. గత నాలుగు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అధ్యయం చేసి.. 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ డేటాను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది.
రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని సర్వేలు తేల్చి చెప్పాయి. శనివారం విడుదలైన రెండు సర్వే సంస్థల రిపోర్టుల్లో బీఆర్ఎస్ పార్టీ 70కి పైగా సీట్లు గెలుచుకొంటుందని తేలింది. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టీవీ, ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ అండ్ రిసెర్చ్ సర్వీసెస్ సంస్థలు వేర్వేరుగా సర్వేలు నిర్వహించాయి. ఈ రెండు సర్వేల్లోనూ బీఆర్ఎస్ సాధారణ మెజార్టీకి మించి స్థానాలు గెలుచుకొంటుందని తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 30 సీట్ల వద్దే ఆగిపోతుందని పేర్కొన్నాయి. ఇక బీజేపీకి సింగిల్ డిజిట్ సీట్లు దాటవని స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టనున్నారని తేలిపోయింది.
ప్రముఖ జాతీయ టీవీ చానల్ ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలోనూ ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 34 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నది. ఇక ఈ సర్వే ప్రకారం బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్నది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని తెలిపింది. ఎంఐఎం కూడా 7 స్థానాలు గెలుచుకుంటుందని, ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకుంటారని సర్వే తేల్చింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా 10 శాతం..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేశామన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది. కానీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఓట్ల పరంగా దాదాపు పదిశాతం వెనుకబడి ఉన్నదని తాజా సర్వేలు తేల్చాయి. బీఆర్ఎస్కు 42.5 శాతం, కాంగ్రెస్ 33.1 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించాయి. అంటే ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 9.4 శాతం. ఓట్ల తేడా రెండుమూడు శాతం వరకు ఉంటేనే ఆ పార్టీల మధ్య పోటీ ఉన్నట్టుగా భావిస్తారు. ఈ లెక్కన 10 శాతం తేడా ఉందంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ పోటీలో లేదనేది స్పష్టమవుతున్నది. ఇక బీజేపీ 16.3 శాతం ఓట్లతో అసుల సోదిలోనే లేదు.
కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్నే బీజేపీ కూడా చేసింది. అందుకే రాష్ట్రంలో ఆ పార్టీ బీఆర్ఎస్లాగా ఎదగలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే గెలిచినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు సాధించింది. అలాగే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఆ పార్టీ తన బలాన్ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో అసలు రంగంలోనే లేకుండా పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బలం ఉన్నప్పటికీ తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రజల తిరస్కరణకు గురైంది. బీజేపీ మొదట ఓబీసీ రాగం అందుకున్నప్పటికీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌ని అధ్యక్షునిగా తప్పించి కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం వల్ల బీజేపీకి నష్టం చేకూర్చింది. సీఎంగా కేసీఆర్‌ను 43 శాతం ప్రజలు కోరుకుంటుండగా, కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డిని 30 శాతం, బీజేపీ నుంచి బండి సంజయ్‌ని 11 శాతం, కిషన్‌రెడ్డిని కేవలం 4 శాతం ప్రజలు కోరుకుంటున్నారని ఇండియా టీవీ తన సర్వేలో వెల్లడించింది. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఇండియా టీవీ చర్చాగోష్టిలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు, ఎన్నికల విశ్లేషకులు తేల్చి చెప్పారు.
ఫ్యాక్ట్స్ సర్వేలో బీఆర్ఎస్కు 73-78 సీట్లు
ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ అండ్ రిసెర్చ్ సర్వీసెస్ సంస్థ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ది ఏకపక్ష గెలుపేనని స్పష్టం చేసింది. మొత్తం 119 స్థానాలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 73-78 సీట్లు గెలుచుకోబోతున్నదని వెల్లడించింది. తద్వారా బీఆర్ఎస్ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 17,850 పోలింగ్ కేంద్రాల్లో 1.12 లక్షల మంది ఓటర్ల అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించి సర్వే నిర్వహించింది. ఇందులో మెజార్టీ ఓటర్లు బీఆర్ఎస్ వైపు నిలిచారు. కాంగ్రెస్‌కు 25-30 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని సర్వే పేర్కొన్నది. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమతయ్యే పరిస్థితి ఉన్నదని వెల్లడించింది. బీజేపీకి 6-10 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. ఎంఐఎంకు 7-8 సీట్లు, ఇతరులకు ఒక సీటు వస్తుందని పేర్కొన్నది.
కేసీఆర్, ప్రభుత్వ పనితీరు భేష్
ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ అండ్ రిసెర్చ్ సర్వీసెస్ సంస్థ.. సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, సీఎంగా కేసీఆర్ పనితీరు, ప్రభుత్వ పనితీరుపైగా ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది. సీఎంగా కేసీఆర్ పనితీరు బాగుందని, ప్రభుత్వ పనితీరు కూడా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ పనితీరు చాలా బాగున్నదని 36.9 శాతం మంది అభిప్రాయపడగా మరో 37.2 శాతం మంది బాగున్నదని కితాబిచ్చారు. ఇక ప్రభుత్వ పనితీరు కూడా చాలా బాగున్నదని 31.9 శాతం మంది అభిప్రాయపడగా, బాగున్నదని 38.7శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విధంగా మెజార్టీ ప్రజలు సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు.

