హైదరాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి అత్యాశతో ప్రమోషన్ ఆశలు గల్లంతైన కొందరు అధికారులకు త్వరలో మేలు జరుగనున్నది. ప్రమోషన్ దాకా వచ్చి చేజారిన వారందరికీ సదవకాశం దక్కనున్నది. ఈ మేరకు వారి కోసమే ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఆదేశాలను జారీచేశారు. రెగ్యులర్ డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ)లో అర్హత పొందిన అధికారులకు త్వరలోనే న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రివ్యూ డీపీసీ ద్వారా డీసీ (డిప్యూటీ కమిషనర్) స్థానంలో ఉన్న అధికారికి జేసీ (జాయింట్ కమిషనర్)గా ఉద్యోగోన్నతి లభించనున్నదని తేల్చిచెప్పారు. ఈ నేపధ్యంలో డీసీ స్థానంలో ఒక ఖాళీ ఏర్పడుతుందని, ఈ ఖాళీని రెగ్యులర్ డీపీసీలోఅర్హత పొందిన అసిస్టెంట్ కమిషనర్‌తో భర్తీ చేస్తామని తెలిపారు. ఏసీ పోస్టుల్లో ఏర్పడిన ఖాళీని, ఈఎస్తో, ఈఎస్ పోస్టు ఖాళీని ఏఈఎస్‌తో భర్తీ చేస్తామని చెప్పారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. డీపీసీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించినట్టు తెలిపారు. వ్యక్తిగత సర్వీస్‌పరమైన కారణాలతో ఒక ఉన్నతాధికారి తనకు వచ్చిన ప్రమోషన్‌ను నిరాకరించారని, ఆ తర్వాతి ముగ్గురు అధికారులకు తాత్కాలికంగా ప్రమోషన్లు నిలిచిన మాట వాస్తవమేనని అంగీకరించారు.
అసలు ఏం జరిగిరింది?
రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖలో ఇటీవల 53 మంది అధికారులకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇద్దరు జాయింట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లు, 14 మంది అసిస్టెంట్ కమిషనర్ల ప్రమోషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. వీరిలో ప్రస్తుతం డీసీగా ఉన్న ఒక అధికారి జేసీగా ఉద్యోగోన్నతి పొందారు. కానీ ఆయన తన ప్రమోషన్‌ను నిరాకరించారు. దీంతో డిప్యూటీ కమిషనర్ ప్రమోషన్లలో ఒకటి నిలిచిపోయింది. ఈ ప్రభావం ఏసీ పోస్టుపై పడింది. అలాగే ఆ కిందిస్థాయి ఎక్సైజ్ సూపరింన్టెండ్ స్థాయి వరకు వెళ్లింది. దీంతో ప్రమోషన్ల అంచువరకు వెళ్లి ఆగిపోయిన అధికారులు ఆందోళనకు చెందారు. పరిస్థితి ఇలానే కొనసాగితే.. భవిష్యత్తులో కమిషనర్ స్థాయిలో చేపట్టబోమే డీపీసీపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారుల ఆందోళనను ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలుగా ప్రచురించింది. తాజాగా దీనిపై స్పందించిన కమిషనర్ ప్రమోషన్లకు భరోసా ఇచ్చారు. 2016 ఏసీ ప్యానల్ అధికారులకు రివ్యూ డీపీసీ ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు. రివ్యూ డీపీసీ అనంతరం ఒక స్పష్టత వస్తుందని, ఆ తర్వాత ప్రభుత్వ పరిధిలోని పోస్టులకు, కమిషనర్ పరిధిలోని పోస్టులకు ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని హరికిరణ్ తెలిపారు.
ఫిర్యాదులు రాకుంటే ఏమీ చేయలేం..
లాటరీ ద్వారా మద్యం దుకాణాలకు లైసెన్సులు పొందిన వారికి రెండేండ్ల శాశ్వత లైసెన్స్‌ను ఇచ్చామని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ చెప్పారు. ఈ సందర్భంలో భారీగా అవినీతి చోటుచేసుకున్నదని, దుకాణదారులు, ఎక్సైజ్ అధికారుల మధ్య డబ్బులు చేతులు మారినట్టు వచ్చిన ఆరోపణనలపైనా ఆయన స్పందించారు. బాధిత దుకాణదారుల నుంచి లిఖితపూర్వకంగా కానీ, కనీసం ఫోన్‌లైన్ ఫిర్యాదులైనా రానంత వరకు తానేమీ చేయలేనని పేర్కొన్నారు. ఫిర్యాధుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్‌ను సైతం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదులు ఇస్తే తమ శాఖ అధికారులు ఏమైనా చేస్తారేమోననే భయం ఉంటే.. ఏసీబీ లాంటి విభాగాలకు ఫిర్యాదులు చేయవచ్చని సలహా ఇచ్చారు.