Karimnagar | ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ప్రధాన నియోజకవర్గం. ఉవ్వెత్తున ఎగసిపడిన మలిదశ ఉద్యమంతో నియోజకవర్గ ముఖచిత్రం మారింది. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న పట్టణం రెండు దఫాలుగా పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు రికార్డు మెజార్టీతో పట్టం కట్టింది. 2014లో, 2018లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై గంగుల రెండుసార్లు ఘన విజయం సాధించారు. ప్రస్తుతం హ్యాట్రిక్ విక్టరీ దిశగా ప్రచారం ముమ్మరం చేశారు గంగుల. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. సభలు, సమావేశాలు పెట్టి బీఆర్ఎస్ చేస్తున్న, చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెబుతున్నారు. ప్రజల మధ్యే ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న గంగుల కమలాకర్కే మా ఓటు అంటున్నారు కరీంనగర్ వాసులు.
కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి నాలుగు దశాబ్దాలపాటు కరీంనగర్‌పై పెత్తనం చలాయించినా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచే కరీంనగర్ అభివృద్ధిపథంలో పయనిస్తున్నది. పట్టణానికి స్వాగతం పలికే దిగువ మానేరు ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఏడాదంతా నిండుకుండలా తొణికిసలాడుతూ కరీంనగర్ నసీబు మారిన తీరును కండ్లకు కడుతుంది. రూ.224 కోట్ల వ్యయంతో మానేరుపై నిర్మించిన తీగల వంతెన మరో సాక్ష్యం. పట్టణంలో వెలసిన ఐటీ టవర్.. కరీంనగర్ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నది. మానేరు వాగు పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తెచ్చారు. దీనికి 410 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు సుమారు రూ. 2,500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగింది. రూ.600 కోట్లతో నగర రూపురేఖలను మార్చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తాజాగా మెడికల్ కళాశాలకు రూ.500 కోట్లు మంజూరయ్యాయి.
రైతుబంధు కింద నియోజకవర్గంలో 17,364 రైతు కుటుంబాలకు రూ.124.09 కోట్ల పెట్టుబడి సహాయం అందింది. దళిత బంధు కింద నియోజకవర్గానికి 100 యూనిట్లు వచ్చాయి. లబ్ధిదారులు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ నిబ్బరంగా జీవనం సాగిస్తున్నారు.
మిషన్ కాకతీయతో పల్లెపల్లెలో చెరువులు నిండుకుండల్లా మారాయి. ఆయకట్టుకు ఆయువుపట్టు దొరికింది. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు. రైతులకు సాగునీరు రంది లేకుండా పోయింది.
మిషన్ భగీరథ కింద నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ఒకప్పుడు వారానికోసారి నీళ్లు వస్తే మహాభాగ్యం అనుకున్న కరీంనగర్లో నేడు ప్రతిరోజూ ఇంటింటా గంగ ఉప్పొంగుతున్నది. రానున్న రోజుల్లో 24 గంటలపాటు నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.