హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏడాది మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి ఈ ఏడాది జూన్ 20 తర్వాత రాష్ట్రంలో ప్రవేశించాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి వారం పదిరోజులు ముందుగానే వెనక్కి వెళ్లాయి. అక్టోబర్ మొదటి వారంలోనూ వర్షాలు కురిసేవని, ఈ ఏడాది మాత్రం వర్షాలు పడటం లేదని ఐఎండీ అధికారులు వెల్లడించారు. దీనికితోడు ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారం మాదిరిగా ఉష్ణోగ్రతలు ఉన్నట్టు తెలిపారు. ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టు చెప్పారు. నవంబర్ రెండో వారం వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వివరించారు. నవంబర్ 15 తర్వాత చలి పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా బలపడిందని భారత వాతావరణ కేంద్రం( ఐఎండీ) తెలిపింది. రాబోయే మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.