హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శివసేన పార్టీకి చెందిన కీలక నేత బుధవారం గులాబీ కండువా కప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకొన్నది. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన దిలీప్ గోరె పార్టీలో చేరారు. ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దిలీప్ గోరె గతంలో బీడ్ మున్సిపల్ మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం శివసేన పార్టీ బీడ్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ ప్రాంతంలో రాజకీయంగా గట్టి పట్టుంది. గోరేతోపాటు మహారాష్ట్ర చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విద్యాధికుడు శివరాజ్ జనార్దన్‌రావు భంగర్, పలువురు మహారాష్ట్ర నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ తదితరులు ఉన్నారు.