నల్లబెల్లి, డిసెంబర్ 8 : వంట గ్యాస్ కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చా యి. గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలనే నిబంధన చాలా రోజులుగా ఉన్నా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సదరు గ్యాస్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైంది. తాము అధికారంలోకి వస్తే రూ. 500లకే గ్యాస్ బండను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలనే పుకార్లు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో శుక్రవారం ఉద యం 7 గంటలకే మహిళలు, వృద్ధులు మండల కేంద్రంలోని సదరు గ్యాస్ ఏజెన్సీ వద్దకు చేరుకుని క్యూలైన్లో బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిల్చున్న గొల్లపల్లెకు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు సల్పాల సమ్మక్క లోబీపీతో పడిపోయింది. గ్యాస్ ఏజెన్సీ వారు స్పందించకపోవడంతో తోటి మహిళలు సమీపంలోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఈ ఘటనపై మహిళలు, మండల ప్రజలు గ్యాస్ ఏజెన్సీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవైసీపై గ్యాస్ ఏజెన్సీ వారితోపాటు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు.