Indiramma Illu | నిరుపేద కుటుంబాన్ని కాంగ్రెస్ సర్కారు దగా చేసింది.. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ధ్రువీకరణ పత్రం ఇచ్చి.. తీరా ఇప్పుడు మంజూరు కాలేదంటూ మొండిచెయ్యి చూపింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో తమ రేకుల ఇంటిని కూలగొట్టుకొని కొత్త ఇంటి కోసం బేస్మెంట్ కూడా వేసుకున్న అనిత, శేఖర్ దంపతులు ఇప్పుడు దిక్కుతోచక కన్నీటి పర్యంతమవుతున్నారు.
కందుకూరు, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ధ్రువీకరణ పత్రమిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కొత్త ఇల్లు కట్టుకుని ఆత్మగౌరవంతో బతుకుదామని ఆశ పడిన ఆ కుటుంబ సంతోషాన్ని కొద్ది రోజుల్లోనే దూరం చేసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడకు చెందిన శేఖర్ భార్య అనిత పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు ధ్రవీకరణ పత్రం అందించారు.
ఆ తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చి ముగ్గుపోసి ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరారు. వారి మాటలు నమ్మిన శేఖర్ దంపతులు ఉంటున్న రేకుల ఇంటిని కూల్చివేసి కొత్త ఇంటి కోసం బేస్మెంట్ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బేస్మెంట్ వరకు పూర్తయిన ఇంటిని అధికారులు పరిశీలించి లక్షరూపాయలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి అధికారులు కోలుకోలేని షాకిచ్చారు. వైఎస్సార్ హయాంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, కాబట్టి ఇప్పుడు మంజూరైన ఇల్లు రద్దయిందని హౌసింగ్ ఏఈ చెప్పడంతో శేఖర్ దంపతులు నిర్ఘాంతపోయారు. దీంతో వారు ఎంపీడీవో సరితను కలిసి విషయం చెప్పారు.
తాము అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టామని బిల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. బిల్లు మంజూరు కాకుంటే కుటుంబం రోడ్డున పడుతుందని వాపోయారు. ఇంటి మంజూరు పత్రం ఇచ్చినప్పుడు అధికారులకు ఈ విషయం తెలియదా? అని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకుడు, పీఏసీఎస్ డైరెక్టర్ సత్తునేని వెంకట్రాంరెడ్డిని కోరారు. విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బిల్లు మంజూరుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. అధికారులు చొరవ తీసుకుని వెంటనే బేస్మెంట్ బిల్లు చెల్లించాలని బీఆర్ఎస్ నాయకుడు కంద పెద్దనర్సింహ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.