హైదరాబాద్: హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పూర్తయితే హైదరాబాద్‌తో ఏ నగరం పోటీ పడలేదన్నారు. నగరంలో కొత్తగా నిర్మించిన షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. నగరంలో చార్మినార్, గోల్కొండ సహా ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, హెరిటేజ్ సిటీగా హైదరాబాద్‌ను గుర్తించేలా కృషిచేయాలన్నారు. రసూల్‌పురాలో కొంత భూమి కేంద్రం ఆధీనంలో ఉందని, దానిని ఇప్పించాలన్నారు. కంటోన్మెంట్లో 21 రోడ్లను మూసివేశారని, వాటిని తెరిపించేలా కృషి చేయాలన్నారు .
స్కైవేల నిర్మాణానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు స్కైవేలు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర రక్షణశాఖను భూములు ఇవ్వాలని కోరినా స్పందించడం లేదన్నారు.
ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీలో పెద్దఎత్తున రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ కష్టాలు లేకుండా గణనీయమైన పురోగతి సాధించామన్నారు. హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున లింక్ రోడ్లు నిర్మించామన్నారు. 132 కొత్త లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజినల్ రింగ్‌రోడ్‌ను కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే దేశంలో ఏ నగరంలో కూడా హైదరాబాద్‌కు పోటీ రాదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని చెప్పారు.