కందుకూరు, జూలై 7 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు లాటరీ పద్ధతి ద్వారా సోమవారం ఫ్లాట్లను కేటాయించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై భూములు కోల్పోయిన రైతులు వద్దకు వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు రైతులు మీ కృషివల్లి ప్లాట్లు వస్తున్నాయని రైతులు ఆనందపడ్డారు.
అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా తాను రైతులకు నష్టపరిహారం సరిపోడం లేదని అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారంతోపాటు ఆధారంగా ఎకరానికి 121 గజాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తన వినతికి కేసిఆర్ అంగీకరించారని గుర్తుచేశారు. ఎన్నికల కంటే ముందు లేఔట్ చేసి సిద్ధం చేశామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ప్లాట్లను అందజేయడంలో 18 నెలలుగా నిర్లక్ష్యం చూపిందని అన్నారు. రైతుల పక్షాన నమస్తే తెలంగాణ దినపత్రిక కథనాలు రాయడంతో పాటు, బీఆర్ఎస్ నాయకులు నిలదీయడంతో ఎట్టకేలకు రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగానే వ్యవహరిస్తుందని అన్నారు. ఫార్మాసిటీ విషయంలో పూటకోమాట మారుస్తుందని ఎద్దేవా చేశారు.
ప్లాట్లు అమ్ముకోవద్దు…
తమకు వచ్చిన ప్లాట్లను ఎవరూ అమ్ముకోవద్దని రైతులకు సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ ప్లాట్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. చాలామంది బ్రోకర్లు చౌకగా ఈ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ప్లాట్ ధర రూ.10 లక్షలు పలుకుతుంది.. కానీ భవిష్యత్తులో కోట్ల విలువ చేస్తుందని చెప్పారు. కాబట్టి ఈ ప్లాట్లను అమ్మకుని మోసపోవద్దని సూచించారు.
రైతులపై ఆంక్షలా?
రైతులపై అంక్షలు విధించడం పట్ల సబితా ఇంద్రారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫార్మా రైతులకు ప్లాట్లు లాటరీ ద్వారా కేటాయింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం, పోలీసుల తనిఖీలు చూసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, తో పాటు మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రజలందరూ ఒకేసారి వస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఇవాళ 60 గజాలు ఉన్న రైతులకు మాత్రమే అనుమతినిస్తున్నామని ఇందులో ఆంక్షలు లేవని సబితా ఇంద్రారెడ్డికి వివరించారు.