హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ చెరువుల్లో ఇటీవల లభ్యమవుతున్న ఆఫ్రికా జాతి చేపలు మత్స్యకారులను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, హైదరాబాద్ చెరువుల్లో ‘సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్’ ‘తిలాపి యా’ చేపలు భారీగా వెలుగు చూస్తున్నాయి. దీంతో సంప్రదాయ చేప రకాలైన పరక, చందమామ, జెల్ల, కొడిపె వంటి చిన్న చేపల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. తిలాపియా చేపల్లో 11 రకాలు ఉన్నాయి. ఇవి ఆఫ్రికా జాతికి చెందినవి. వీటిలో ‘సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్’ లేదా ‘గురక’ లేదా ‘దెయ్యం’ చేపలు అత్యంత విషపూరితమైనవి.
ఇవి ఉన్న చోట స్థానిక జాతి చేపలు మనుగడ సాధించడం కష్టం. దీంతో రాష్ట్రంలో చేపలపెంపకం, వాటి వేటే జీవనాధారంగా బతుకుతున్న వారికి భారీగా నష్టం వాటిల్లుతున్నది. తిలాపియా రకం చేపలు ఆహారానికి పనికి వచ్చేవే అయినప్పటికీ.. వీటిని దేశంలో నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఆహారంగా వినియోగిస్తున్నారు. ఎకువగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగిస్తున్నారు. దేశంలో నిషేధం ఉండటంతో వీటికి మార్కెటింగ్ లేదు. ప్రస్తుతం తెల్లచేపల ధర మారెట్లో రూ.200వరకు పలుకుతుండగా రాక్షసి(తిలాపియా)చేపలు రూ.50కే లభిస్తున్నాయి.
ఇటీవల వేసవిలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పెద్ద చెరువులో ట్రాక్టర్ల కొద్దీ రాక్షసి(తిలాపియా) చేపలు స్థానిక మత్స్యకారుల వలలకు చిక్కాయి. వారం రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) చెరువులో మూడొంతులు తిలాపియా చేపలే దొరకడంతో మత్స్యకారులు అవాకయ్యారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నట్టు మత్య్సకారులు, చేపల పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురక లేదా రాక్షసి రకం చేప ఆఫ్రికా జాతికి చెందిన తిలాపియా. ఇది ఉష్ణమండల జాతికి చెందినది. ఇవి సముద్రపు చేపలు. ఆఫ్రికాలో మొదట దీన్ని గుర్తించినట్టు మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా ఇది అన్ని ప్రాంతాలకు పాకింది. ఇప్పుడు దక్షిణ భారతదేశ జలాశయాల్లో సురక్షిత స్థానాన్ని ఏర్పరచుకున్నట్టు గుర్తించారు. విత్తనం వేయకున్నా ఈ రకం చేపలు జలాశయాల్లో విపరీతంగా ఉత్పత్తి అవుతున్నట్టు పేర్కొంటున్నారు. పదేండ్లకు పైగా జీవించే రాక్షసి(తిలాపియా) చేప గరిష్ఠంగా 5 కిలోల కంటే ఎకువ బరువు పెరుగుతుంది.
ఈ చేపలు ఏడాదికి మూడు పర్యాయాలు పునరుత్పత్తి చేస్తాయి. వీటి సం తతి ఎక్కువగా ఉండటంతో జలాశయాలు, చెరువుల్లోని ఇతర చేపలకు ఆహారం దొరకకుండా చేస్తాయి. ఫలితంగా వాటి సంతతి తగ్గి, వీటి సంఖ్య రెట్టింపు అవుతున్నది. అయిదారు నెలల వయసులో వంద గ్రాముల ఆడ చేప ఒకో దఫా 100గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. వేసవిలో జలాశయాలు ఎండిపోయినా తిలాపియా చేపలు బతికే ఉంటాయి. వర్షాలు కురవగానే వాటి సంతతి వృద్ధి చెందుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వాస్తవంగా సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్, తిలాపియా రకం చేపలు తెలంగాణలో పదేండ్ల క్రితం వరకు లేవు. ఉచిత చేప పిల్లల పంపిణీ తర్వాతనే ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఏపీ నుంచి తెచ్చిన విత్తనంలోనే ఈ ప్రమాదకర చేప రకాలు వచ్చాయి. ఇప్పుడు అన్ని జలాశయాల్లో సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్, తిలాపియా చేపలు పెరిగాయి. సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్‌ను ‘దెయ్యం’ చేప అని కూడా అంటారు. ఇవి పదునైన పళ్లు, ముళ్లతో ఇతర చేపలను గాయపరిచి తింటాయి. ఇవి చెరువుల్లోకి చేరితే కొద్ది రోజుల్లోనే ఇతర చేపలన్నింటినీ తినేస్తాయి. వీటి శరీరం విషపూరితం కావడంతో ఎవరూ వీటిని తినరు.
వాస్తవంగా తిలాపియా చేపలు తినడానికి అనుకూలమైనవి. కానీ దేశంలో వీటిని నిషేధించారు. ఇవి పెరిగిన చోట ఇతర చేపలకు ఆహారం దొరకకుండా చేస్తాయి. దీంతో ఇతర చేపల సంతతి తగ్గిపోతుంది. ఈ చేపలు ఒకే ముల్లును కలిగి ఉంటాయి. తినడానికి సులువైనవి. కానీ తెలంగాణలో ఈ రకం చేపలు తినరు. అందువల్ల మార్కెటింగ్ ఉండదు. కానీ ప్రపంచవ్యాప్తంగా హోటళ్లలో ఈ రకం చేపలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ చేపలపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలి. తిలాపియాలో ఇతర రకం చేపలకు హాని కలగకుండా ఆల్మేల్(మగ తిలాపియా), గిఫ్ట్ తిలాపియా(జనటికల్ ప్రూఫ్డ్ ఫిష్ టెక్నాలజీ) రకం వాటిని తీసుకురావాలి. అప్పుడే మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
– పిట్టల రవీందర్, మత్స్యసహకార కార్పొరేషన్ మాజీ చైర్మన్