నాగర్‌కర్నూల్, జూన్ 29 : రేవంత్ ప్రభుత్వం ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిండా మునిగిపోయామని నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రైతు లు ఆవేదన చెందారు. సోమవారం కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిజినేపల్లి, వడ్డెమాన్, శాయిన్‌పల్లి, గంగారం, అల్లీపూర్, వెల్గొండ, మహదేవునిపేట గ్రామాలకు చెందిన 80 మంది రైతులు యాసంగిలో పండించిన మక్క, వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మండలానికి చెందిన ముగ్గురు దళారులకు విక్రయించారు. రెండు నెలల కిందట కొనుగోలు చేసిన వారు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెక్కు లు అందించారు. ఆ చెక్కులతో బ్యాంకుకు వెళ్తే డబ్బులు లేకపోవడంతో రైతులు కంగుతిన్నారు. తర్వాత దళారుల ఆఫీస్‌కు వెళ్తే ఇంకా తమకు డబ్బులు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ధాన్యం కొన్న వారిలో ఒకరు షాద్‌నగర్ ప్రాంతంలో హత్యకు గురికావడం.. మరో ఇద్దరు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన రైతులు గత బుధవారం బిజినేపల్లి పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. దాదాపు రూ.2 కోట్లకుపైగా డబ్బులు రావాల్సి ఉన్నదని, ఇంకా అందకపోవడంతో అసలుకే మోసం జరిగిందని కలెక్టరేట్‌కు వచ్చినట్టు చెప్పారు. న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చినట్టు బాధిత రైతులు తెలిపారు.