జూలూరుపాడు, జూలై 14 : వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామీణులు అనుసరించే వినూత్న ఆచారాలు మరోసారి తెరపైకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో తొలకరి వర్షాలు ముఖం చాటేయడంతో, పల్లె జనం సాంప్రదాయబద్ధంగా కప్పతల్లికి జలాభిషేకం నిర్వహించారు.
వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా కలిగిన కాకర్ల గ్రామంలో ప్రస్తుత సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలో, కరవు ఛాయలు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ గ్రామ పెద్దలు, యువకులు అంతా ఏకమయ్యారు. సాంప్రదాయం ప్రకారం ఒక కర్రకు మధ్యలో కప్పను ఉంచి, దానికి వేపాకులను చుట్టారు. ఇద్దరు యువకులు ఆ కర్రను భుజాలపై మోస్తూ, మేళతాళాల నడుమ గ్రామంలో ఊరేగించారు.

పల్లె వీధుల్లో ఈ ఊరేగింపు సాగుతుండగా మహిళలు ప్రతి ఇంటి ముందూ కప్పతల్లికి ఘనస్వాగతం పలికారు. ఇళ్ల నుండి బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లిపై కుమ్మరిస్తూ జలాభిషేకం చేశారు.
కప్పతల్లి నీటితో తడిస్తే వరుణ దేవుడు కరుణించి, భూమి తడిసేలా వర్షాలు కురిపిస్తాడనేది తమ అచంచల విశ్వాసమని గ్రామస్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామం మొత్తం పాడిపంటలతో, పచ్చదనంతో విరాజిల్లాలని.. సకాలంలో వర్షాలు పడి ఊరు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు.
‘వ్యవసాయం ఎక్కువగా వర్షంపైనే ఆధారపడి ఉంటుంది. కాలం కానప్పుడు వరుణుడిని ప్రసన్నం చేసుకోవడానికి మా పూర్వీకుల కాలం నుండి ఈ కప్పతల్లి ఆట ఆడే ఆచారం వస్తోంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. ప్రకృతిని పూజించే మా పల్లె సంస్కృతి. కప్పతల్లిని తడిపితే వాన దేవుడు కరుణిస్తాడనే నమ్మకం అనాదిగా నిజమవుతూనే ఉంది’ అని కాకర్ల గ్రామ పెద్దలు పేర్కొన్నారు. తరాలు మారుతున్నా, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే ఇలాంటి సాంప్రదాయాలు నేటికీ సజీవంగా ఉండడం విశేషం.