హైదరాబాద్, జూలై 19 (నమస్తే తె లంగాణ): ఎస్ఎల్బీసీ పునరుద్ధరణకు సంబంధించి జీఎస్ఐ (జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా), ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో వెంటనే సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వానకాలం పంటలకు సమృద్ధి గా నీరు అందించాలని తెలిపారు. సచివాలయంలో శనివారం నీటిపారుదల శాఖ ప్రధానకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, సలహాదారు అదిత్యనాథ్‌దాస్, సహాయకార్యదర్శి కే శ్రీనివాస్, ఈఎన్సీలు అంజాద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేశ్‌బాబు, ఇతర ఉన్నతాధికారుల తో మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. వానకాలం పంటలకు నీటివిడుదల, ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, ఇరిగేషన్‌శాఖ భూముల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూతూ.. సాగునీటి విడుదలపై రూట్‌మ్యాప్ రూపొందించుకొని ముందుకుపోవాలని సూచించారు.
వరదలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని, ఇతరశాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మిగిలిన 10 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జాతీయ భౌగోళిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్ఐ)తో పాటు భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్ఐ) సహకారంతో ఏరియల్ లైడార్ సర్వేను నిర్వహించనున్నామని వెల్లడించారు. సొ రంగపనుల్లో అనుభవం కలిగిన మాజీ ఇంజినీర్ ఇన్‌చీఫ్ జనరల్ హర్బల్సింగ్ను నీటిపారుదల శాఖకు గౌరవ సలహాదారుగా నియమిస్తున్నామని ప్రకటించారు. ప్రాజెక్టుల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, ఇరిగేషన్‌శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆ దేశించారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కబ్జాకు గురైన నీటిపారుదలశాఖ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలన్నారు.