హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు ఏఈవోలు అంగీకరించారు. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ మంగళవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో చర్చలు జరపగా… ఏఈవోల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో డిజిటల్ క్రాప్ సర్వేకు ఏఈవోలు అంగీకరించారు. రేపటి నుంచే సర్వే ప్రారంభించాలని, సర్వేలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని కార్యదర్శి హామీ ఇచ్చినట్టు జేఏసీ నేతలు వెల్లడించారు. కేంద్ర పథకం డిజిటల్ క్రాప్ సర్వేను చేయబోమని, ఈ కార్యక్రమంతో తమకు పనిభారం ఎక్కువవుతున్నదని ఏఈవోలు సర్వేను బహిష్కరించారు. దీంతో ఉద్యోగుల జేఏసీ కల్పించుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, నాయకుడు రామకృష్ణ, ఏవో అసోసియేషన్ నేతలు వైద్యనాథం, శశిధర్‌రెడ్డి, ఏఈవో అసోసియేషన్ నేతలు శ్రావణ్‌కుమార్, సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.