హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): డిజిటల్ క్రాప్ సర్వే చేయలేదన్న కోపంతో రాష్ట్ర ప్రభుత్వం 165 మంది వ్యవసాయ విస్తరణాధికారులను సస్పెండ్ చేయడంపై ఏఈవోలు రగిలిపోయారు. వ్యవసాయ శాఖతో తాడోపేడో తేల్చుకునేందుకు బుధవారం భారీ సంఖ్యలో హైదరాబాద్కు తరలివచ్చారు. జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ డైర్టెరేట్లో ధర్నాకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఓ బడా సంఘం నేతలను రంగంలోకి దించింది. ఆ నేతలు ఏఈవోలను బెదిరించినట్టు తెలిసింది. ‘ఈ ధర్నా చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అసలు మీ సంఘం ఎక్కడున్నది? రిజిస్ట్రేషన్ చూపించండి’ అంటూ విరుచుకుపడినట్టు సమాచారం.
ఏఈవోలతో డైరెక్టర్ చర్చలు సఫలం
165 మంది ఏఈవోల సస్పెన్షన్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడం, మిగిలిన ఏఈవోలు మూకుమ్మడి సెలవులో వెళ్లేందుకు నిర్ణయించడంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. అందులో భాగంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి బుధవారం ఉదయం ఏఈవోలను చర్చలకు పిలిచారు. ముందు సర్వే ప్రారంభించాలని, సర్వే చేయడంలో ఎదురయ్యే సమస్యలను వచ్చే వారం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏఈవోలపై సస్పెన్షన్ను కూడా ఎత్తివేస్తామని తెలిపారు. దీంతో సర్వే నిర్వహణకు ఏఈవో సంఘం నేతలు అంగీకరించారు. డిజిటల్ క్రాప్ సర్వే యాప్ను డౌన్లోడ్ చేసుకొని గురువారం నుంచి సర్వే చేస్తామని తెలిపారు. వారం రోజుల్లో తమ సమస్యను పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో నిరసనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఏఈవో సంఘం నేత సుమన్ వెల్లడించారు.