హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ‘గురుకుల’ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు మంగళవారం ఉదయం సీఎం నివాసం ఎదుట ధర్నా చేశారు. మోకాళ్లపై కూర్చొని సుమారు 300 మంది నిరసన వ్యక్తం చేశారు. ‘సీఎం గారూ న్యాయం చేయండి’ అంటూ చేతులెత్తి వేడుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్, లైబ్రేరియన్ తదితర 9,210 పోస్టులకు గురుకుల బోర్డు వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చి, ఒకేసారి పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. కొందరు అభ్యర్థులు రెండుమూడు పోస్టులకు ఎంపికయ్యారన్నారు. వారు ముందుగా చిన్న పోస్టుల్లో చేరి, ఆ తర్వాత పెద్ద పోస్టుల ఫలితాలు రాగానే వదిలి వెళ్లిపోతున్నారని తెలిపారు. రీలిక్విష్‌మెంట్ విధానం పాటించకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయని చెప్పారు.
ఇలా సుమారు 1500-2000 పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయని తెలిపారు. రీలిక్విష్‌మెంట్ విధానంలో మెరిట్ జాబితాలోని తర్వాతి విద్యార్థులతో వాటిని భర్తీ చేయాలంటూ తాము హైకోర్టును ఆశ్రయించామని గుర్తుచేశారు. కోర్టు తమకు అనుకూలంగా ఈ ఏడాది మార్చి 26న మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిందని చెప్పారు.
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని గురుకుల బోర్డును కోరగా ఎన్నికల కోడ్ పేరుతో ఇన్నాళ్లూ సాగదీశారని విమర్శించారు. ఇప్పుడు స్కూళ్లు కూడా ప్రారంభం అవుతున్నాయని, తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే తప్పిదాలతో తమ జీవితాలు ఆగమవుతున్నాయని, న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
సంక్షేమభవన్ ఎదుట నిరసన
అభ్యర్థులు ఉదయం 6 గంటలకు సీఎం నివాసానికి చేరుకోగా.. సుమారు రెండు గంటల నిరసన అనంతరం అధికారులు అభ్యర్థులను కలిశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వగా, వారు సీఎంను కలిసిన తర్వాతే వెళ్తామని తేల్చి చెప్పారు. దీంతో నలుగురు అభ్యర్థులను లోనికి తీసుకెళ్లారు. సచివాలయానికి వెళ్లి సీఎంవో కార్యదర్శి సంగీత సత్యనారాయణతో మాట్లాడాలని సూచించారు.
ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వచ్చారు. ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో మల్లన్న కారును అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసేలా సీఎంకు సూచించాలని కోరారు. కొందరు అభ్యర్థులు చేతులెత్తి వేడుకున్నారు. అయినా ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అనంతరం అభ్యర్థులు మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్ వద్దకు వెళ్లారు. గురుకుల బోర్డు కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం సంక్షేమభవన్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం నలుగురు అభ్యర్థులు సచివాలయానికి వెళ్లి సీఎంవో కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. తమ పరిస్థితిని వివరించడంతోపాటు కోర్టు ఆదేశాలను ఆమెకు అందజేశామని అభ్యర్థులు తెలిపారు. తదుపరి బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారని పేర్కొన్నారు.