హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, సుప్రీంకోర్టు ఫిరాయింపు అంశంపై వారం రోజుల్లోనే తేల్చాలని ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న స్పీకర్‌ను ఆదేశించిందని సీనియర్ న్యాయవాది మోహిత్‌రావు చెప్పారు. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కేసును విచారించిందని, జూలై 31వ తేదీనే న్యాయస్థానం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలంటూ స్పీకర్‌కు మూడు నెలల సమయం ఇచ్చిందని గుర్తుచేశారు.
కానీ, స్పీకర్ మూడు నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని అన్నారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రెండు పిటిషన్లను దాఖలు చేశారని తెలిపారు. మరోవైపు స్పీకర్ కార్యాలయం కూడా తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టిందని తెలిపారు. న్యాయస్థానం వారం రోజుల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు.
పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల విచారణ కోసం నోటీసులు ఇవ్వాలని, ఆ తరువాత వారంలోపే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. శాసనసభ స్పీకర్ ఇప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్నారని, ఆయన తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయాన్ని తమకు చెప్పాలని ఆదేశిస్తూ కేసును నాలుగువారాలకు వాయిదా వేసిందని తెలిపారు. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఆ మేరకు సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని, గతంలో మనీలాల్సింగ్ కేసులో జైలుకు కూడా పంపించిందని గుర్తుచేశారు. స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని, మూడు వారాల కింద నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తిచేశారని, కానీ, ఇప్పటివరకు వారిపై నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. మరో నలుగురికి సంబంధించిన విచారణ ప్రక్రియను ఇంకా సాగదీస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల విచారణ ప్రక్రియనే ఇంకా మొదలుపెట్టలేదని, ఇవన్నీ చూసిన తర్వాతనే సుప్రీంకోర్టు వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు. స్పీకర్‌కు చివరి చాన్స్ ఇచ్చిందని తెలిపారు. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించిందని, కానీ స్పీకర్ ఆ ఆదేశాలను పాటించలేదని అన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించిన కోర్టు.. గతంలో రాజేందర్‌సింగ్ రాణా, కేశవ మెఘాచంద్ర కేసుల్లో ఎమ్మెల్యేలను కనీసం అసెంబ్లీ గేటును కూడా తాకవద్దని చెప్పిందని మోహిత్‌రావు గుర్తుచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకునే అవకాశమే లేదని, ఒకవేళ స్పీకర్ వారిని రక్షించే ప్రయత్నం చేస్తే ఆలాంటిదాన్ని కూడా సవాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో) ఇచ్చే తీర్పు న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటుందని పునరుద్ఘాటించారు.