మంచాల, ఫిబ్రవరి 10: మనం తినే తిండి.. తాగే నీరు రోజు కల్తీ చేస్తున్నట్లుగానే, రోజూ ఉదయం తాగే పాలు కూడా కల్తీ (Milk Adulteration) అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఓ పాల బూతులో కొనుగోలు చేసిన పాలను ఇంటికి తీసుకువెళ్లి వేడి చేయగా అవి రబ్బర్ మాదిరిగా మారిపోయిన విషయం ఆ నోట ఈ నోట బయటికి పొక్కింది. ఈ సంఘటన మంచాల మండలం జపాల గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. జాపాల గ్రామానికి చెందిన పుడుతల సుమలత గ్రామంలోని పాల శీతల కేంద్రం వద్ద పాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లి వేడి చేయగా ఆ పాలు దుర్గంధం వెదజల్లే వాసనతో పాటు రబ్బర్గా మారిపోయింది. గతంలో కూడా పలుమార్లు పాలు ఈ విధంగానే వేడి చేస్తే వాసన వస్తున్నాయని పాల వ్యాపారికి చెప్పినా పట్టించుకోలేదన్నారు.
జోరుగా కల్తీ వ్యాపారం
మండలంలో కల్తీ పాల వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన కొందరు కల్తీ పాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. పాల వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పాలకంటే రెండింతలుగా కల్తీ పాలను తయారుచేసి దర్జాగా నగరంలో విక్రయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో రోజురోజుకు కల్తీ పాల వ్యాపారం జోరుగా విస్తరిస్తుంది. మండలంలోని అనేక గ్రామాల్లో కూడా కల్తీ పాల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. దీంతో కల్తీ పాల వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జాపాల, ఆరుట్ల, చెన్నారెడ్డిగూడెం, మంచాల, బండాలేమురు తదితర గ్రామాల్లో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది. తాజాగా నెల రోజుల క్రితం జాపాల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తు పలువురు ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. అయినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా యధావిధిగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అధికారులు ఇకనైనా మేల్కొని గ్రామాలలో కొనసాగుతున్న కల్తీ పాల వ్యాపారులపై చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.