e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides చలో సర్కారు కాలేజీ

చలో సర్కారు కాలేజీ

చలో సర్కారు కాలేజీ
  • ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల జోరు
  • 15 రోజుల్లో 15వేల అడ్మిషన్లు
  • ఆన్‌లైన్‌ ప్రవేశాలతో సత్ఫలితాలు
  • పైసా ఫీజు లేదు.. బుక్స్‌ ఉచితం

హైదరాబాద్‌, జూన్‌ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు ఊపందుకున్నాయి. అడ్మిషన్లు ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ సంఖ్యలో విద్యార్థులు చేరారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా విద్యార్థులు సర్కారు కాలేజీల్లో ప్రవేశాలు పొందారు. కాలేజీలు తెరవడానికి చాలా ముందే ఇంతమంది విద్యార్థులు ప్రవేశాలు పొందడం విశేషం. జూనియర్‌ కాలేజీల్లో మొదటి విడుత అడ్మిషన్లు గత నెల 25నుంచి ప్రారంభించారు. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు ఇంటి నుంచే కాలేజీల్లో ప్రవేశాలు పొందే అవకాశం కల్పించారు. గత రెండేండ్లుగా కొవిడ్‌ కారణంగా అల్పాదాయవర్గాల వారు తమ పిల్లలను సర్కారు కాలేజీల్లో చేర్పించడం వైపే మొగ్గుతున్నారు. ఈ ఏడాది 5,21,073 మంది ఎస్సెస్సీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అత్యధికులను సర్కారు కాలేజీల్లో చేర్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పూర్వవైభవం దిశగా..
పేద, బడుగు విద్యార్థుల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కాలేజీల్లో ఫీజులను మాఫీ చేసింది. 2015-16 విద్యాసంవత్సరం నుంచి నయాపైసా ఫీజు తీసుకోకుండా ప్రవేశాలు కల్పిస్తున్నారు. దాంతోపాటే భవంతులు, ప్రయోగశాలలు మొదలైన వసతులు సమకూర్చడం వల్ల కూడా సర్కారు కాలేజీల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగి, పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలను సర్కారు అదుపు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటినుంచి కొత్త ప్రైవేట్‌ కాలేజీలకు గుర్తింపును ఇవ్వకపోవడం గమనార్హం. ఉన్న కాలేజీలకే గుర్తింపును పునరుద్ధరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 68 కాలేజీలను గతంలోనే ఇంటర్‌బోర్డు మూసివేసింది. గతంలో 2600 పైచిలుకు ప్రైవేట్‌ కాలేజీలుంటే ఇప్పుడు 1,575 మాత్రమే మిగిలాయి. ఈ ఏడాది ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపును సైతం ముందుగా ప్రభుత్వ కాలేజీలకే ముంజూరుచేశారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ కాలేజీలే కనిపించడం, ప్రైవేట్‌ కాలేజీలు లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లోనే చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఫలక్‌నుమా కాలేజీలో ప్రవేశాలు 1000
ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లలో ఇవే అత్యధికం

రాష్ట్ర సర్కారు చేపడుతున్న చర్యలతో ఫలక్‌నుమా ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీ.. ప్రవేశాల్లో సరికొత్త ఘనత సాధించింది. ఒక్క మొదటి సంవత్సరంలోనే ఏకంగా 1000 మంది విద్యార్థులు చేరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీలన్నింటిలో ఇవే అధిక ప్రవేశాలు కావడం గమనార్హం. కాలేజీలో గతేడాది 745 మంది విద్యార్థులు చేరగా.. ఈసారి ఇప్పటికే వెయ్యిమంది ప్రవేశం పొందారు. రాబోయే రోజుల్లో ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని కళాశాల ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ చెప్పారు. ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు బారులు తీరుతున్నారు.

తెలంగాణ సర్కారు చొరవ
ఈ ఏడాది బడ్జెట్‌లో ఇంటర్‌విద్యకు రూ.120 కోట్లతో పాటు, అదనంగా ఉచిత విద్యను కొనసాగించేందుకు మరో రూ.3 కోట్ల కేటాయింపు.
గత ఆరేండ్లల్లో ప్రభుత్వ కాలేజీ భవనాలు, ప్రహరీగోడల నిర్మాణానికి రూ.367 కోట్లు ఖర్చు.
ఫీజులు చెల్లించలేక సతమతమవుతున్న సైన్స్‌ విద్యార్థులకు రూ. 893, ఆర్ట్స్‌ విద్యార్థులకు రూ.533 అడ్మిషన్‌, లైబ్రరీ ఫీజుల రద్దు. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు.
ఫీజుల మాఫీ, పాఠ్యపుస్తకాల కోసమే ప్రభుత్వం ఏటా రూ.20 కోట్ల వరకు వెచ్చిస్తున్నది. రూ.11 కోట్లను ఫీజు మాఫీకి కేటాయించింది. రూ.9 కోట్లు వెచ్చించి ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నది.

హైదరాబాద్‌లోని వివిధ కాలేజీల్లో ఇప్పటి వరకు ప్రవేశాల వివరాలు..
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రభుత్వ బాలుర జూనియర్‌ కాలేజీ: 1075
ఇదే క్యాంపస్‌లోని బాలికల జూనియర్‌ కాలేజీ: 587
మారేడ్‌పల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీ :600
కూకట్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ: 550
చంచల్‌గూడ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ: 360
హుస్సేని ఆలం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ: 310
మహబూబియా బాలికల కాలేజీ: 250

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చలో సర్కారు కాలేజీ

ట్రెండింగ్‌

Advertisement