హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో ఈ సారి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు లక్ష్యం చేరలేదు. అడ్మిషన్లు పెంచాలని అధికారులు ఆదేశిస్తే, 151 కాలేజీల్లో నిరుటితో పోల్చితే అడ్మిషన్లు తగ్గడం గమనార్హం. 2025-26 విద్యాసంవత్సరంలో మొత్తం 1,47,588 మంది విద్యార్థులను చేర్పించాలని ఇంటర్ విద్యా కమిషరేట్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 డిసెంబర్ నుంచే టార్గెట్లు పెట్టి, ప్రిన్సిపాళ్లను సన్నద్ధం చేశారు. ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి, సమీపంలోని జూనియర్ కాలేజీలకెళ్లి విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టారు. జూలై 31నాటికి ఇంటర్ ఫస్టియర్లో 94,155 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు.
జనరల్ కోర్సుల్లో 71,081, వొకేషనల్ కోర్సుల్లో 23,074 చొప్పున అడ్మిషన్లు పొందారు. ఇటీవల కాలంలో 474 మంది అడ్మిషన్లు తీసుకుని, రద్దుచేసుకున్నారు. 33 జిల్లాల్లో 430 సర్కారు జూనియర్ కాలేజీలున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో 1.59లక్షల మంది సర్కారు బడుల నుంచి పదో తరగతి పరీక్షలు రాశారు. వీరితోపాటు ఇతర విద్యాసంస్థల్లోని విద్యార్థులను కలుపుకుని ఈ విద్యాసంవత్సరం ఫస్టియర్లో 1,47,588 మంది విద్యార్థులను చేర్పించాలని ఇంటర్ వి ద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లక్ష్యం చేరలేదు. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఈ నెల 20 వరకు పొడిగించా రు. అంతలోపు అడ్మిషన్లు పెరుగుతాయా? అంటే అనుమానంగానే ఉంది. కాస్త ఉపశమనం ఏమిటంటే నిరుడు 83,844 మంది విద్యార్థులు ఫస్టియర్లో చేరితే ఈ సారి 94,155 మంది చేరడం గమనార్హం.