హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు శనివారం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 844మంది దివ్యాంగులకు రూ.5కోట్లతో స్వయం ఉపాధి కల్పించే యూనిట్ల మంజూరు, దివ్యాంగులకు స్వయంసహాయక సంఘాల ఏర్పాటు చేసి.. తద్వారా 2,367మందికి 3.50 కోట్లను పంపిణీ చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు ఏటా 210మంది ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి రూ.20లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు.
తాజాగా ఆ సంఖ్యను 500 పెంచగా.. అందుకు సంబంధించిన ఫైలుతోపాటు.. మరికొన్ని పైళ్లపై మంత్రి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, సంజయ్‌కుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.