హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో చిచ్చురేపాయి. మీడియా ముందు దళిత మంత్రి పట్ల పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను పార్టీలోని లక్ష్మణ్ సామాజిక వర్గం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పొన్నం వ్యాఖ్యలు మీడియాలో రావడం, పార్టీలోని ఒక వర్గం నేతలు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం సీఎం స్వయంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో మాట్లాడినట్టు తెలిసింది. పొన్నం వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దని సముదాయించే ప్రయత్నం చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు పొన్నం ప్రభాకర్ కూడా ఈ అంశంపై వివరణ ఇచ్చినట్టు సమాచారం. అవి మంత్రి లక్ష్మణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. లక్ష్మణ్ మాత్రం మీడియా ముందే తనను బాడీషేమింగ్ చేయడంతో పరువుపోయిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి సీఎం కూడా ముభావంగానే తలూపినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పొన్నంతో మాట్లాడుతానని, బాధపడవద్దని, ఇంకోసారి రిపీట్ కాకుండా చూస్తానని చెప్పినట్టు సమాచారం.
కరీంనగర్లో కాక
మంత్రులు పొన్నం, అడ్లూరి మధ్య జూబ్లీహిల్స్‌లో మొదలైన సెగలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను తాకినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పొన్నం ప్రభాకర్ వ్యవహారశైలిపై మంత్రి శ్రీధర్‌బాబు అనుకూల వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదట. సోమవారం కరీంనగర్‌కు చెందిన నేతలు పెద్ద ఎత్తున మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్ కుమార్ ఇంటికి వచ్చారు. లక్ష్మణ్‌కుమార్‌కు సంఘీభావం ప్రకటించారు. పొన్నం ప్రభాకర్ ఉద్దేశపూర్వకంగానే మంత్రి శ్రీధర్‌బాబు, ఆయనతో సన్నిహితంగా ఉండే మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 17న కరీంనగర్లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ జెండా ఎగురవేయడంపై పొన్నం ప్రభాకర్, ఆయన అనుచరులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారట. లక్ష్మణ్‌కు మంత్రి పదవి వచ్చినపుడు కూడా పార్టీ నేతల ముందు అవమానించేలా మాట్లాడారని చెప్పారట.
వాస్తవానికి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందినవారని, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు సంబంధం లేదని స్పష్టంచేశారట. నాన్‌లోకల్ నేత కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని చూడడం సరికాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అవసరమైతే ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్తామని పలువురు నేతలు మంత్రులతో అన్నట్టు తెలిసింది. అవన్నీ ఒక ఎత్తు అని, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివని, ఒకటి రెండు రోజుల్లో పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కులసంఘాల నేతలు అల్టిమేటం జారీచేసినట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అదే వేదికపై ఉన్న మంత్రి గడ్డం వివేక్ ఎందుకు ఖండించలేదని కరీంనగర్ నేతలు ప్రశ్నించినట్టు సమాచారం. సాటి దళిత మంత్రిని బాడీషేమింగ్ చేస్తున్నప్పుడు వివేక్ స్పందించకపోగా గురుశిష్యులు అంటూ శ్రీధర్ బాబు, లక్ష్మణ్ గురించి మాట్లాడారని, ఇదేం పద్దతి అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
పార్టీ నిర్ణయం తీసుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు
మంత్రులు సహచరులతో సమన్వయం చేసుకొని వెళ్లే మనస్తత్వంతో ఉండాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో ముచ్చటించారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘మాకు ప్రాధాన్యం లేదు అని అన్నారు. ఇప్పుడు వాళ్లకే కదా బాధ్యతలు అప్పగించింది? మంత్రులుగా ఉన్నవాళ్లు గవర్నమెంట్ ఇమేజ్ను కాపాడాలి. బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్లే బహిరంగంగా కామెంట్లు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. మాట్లాడే ముందే ఆలోచించి మాట్లాడాలి’అని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఉమ్మడి జిల్లా కేంద్రంలో తొలిసారి జెండా ఆవిష్కరించే విషయంలో తొలి అవకాశం సీనియర్ మంత్రులకు ఇచ్చారని, తనకు సూర్యాపేట జిల్లాలో జెండా ఆవిష్కరించే అవకాశం కల్పించారని, ఏ జిల్లాలో ఎవరికి జెండా ఆవిష్కరణకు అవకాశం ఇవ్వాలన్నది ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. మీడియా ప్రతినిధులు పొన్నం ప్రభాకర్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సొంత జిల్లా అని చెప్పుకుంటున్నవాళ్లు సొంత జిల్లాలోనే పోటీచేయాలి. సొంతజిల్లాను వదిలి ఎందుకు బయటకు వెళ్లినట్టు?’ అని ప్రశ్నించారు. తనకు ఆటుపోట్లు కొత్తకాదని, 2001 లో జిల్లా అధ్యక్షుడినైనప్పటి నుంచి చాలా మందిని సమన్వయం చేసుకొని పనిచేశానని గుర్తుచేశారు. తనకు పార్టీయే ముఖ్యమని శ్రీధర్‌బాబు చెప్పారు.
అన్నా.. నీ విజ్ఙతకే వదిలేస్తున్నా
పార్టీ కార్యకర్తలు, తన సామాజికవర్గ నేతల ఒత్తిడి నేపథ్యంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్ స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్ చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తనపై ఎందుకు అలాంటి కామెంట్లు చేశారంటూ నిలదీసినట్టు సమాచారం. అయితే ‘నిన్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు..’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడంతో ‘ పొన్నం అన్నా.. మీ విజ్ఙతకే వదిలివేస్తున్న’ అని చెప్పి మంత్రి అడ్లూరి ఫోన్ కట్ చేసినట్టు చర్చ జరుగుతున్నది.