హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన సిఫారసులను గవర్నర్ తిరసరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదప్రతివాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదించారు.
మంత్రివర్గం తన నిర్ణయాలకు తానే జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ పరిధులకు లోబడే గవర్నర్ విధులు నిర్వహించాలని, వ్యక్తిగత అభిప్రాయాలతో నిర్ణయాలు తీసుకోరాదని అన్నారు. మంత్రివర్గం సిఫారసులను పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి పంపవచ్చునని కానీ అలా పంపకుండా.. రాజ్యాంగ విరుద్ధంగా తిరసరించారని తప్పుపట్టారు. ఈ చర్యను సాధారణ అంశంగా పరిగణించకూడదని, అరుదైన ప్రత్యేక కేసుగా పరిగణించాలని కోరారు. వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించడానికి కారణం వారు రాజకీయాల్లో ఉండటం కాదని చెప్పారు. ఒకవేళ ఇదే నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉంటే తాజాగా ప్రస్తుత మంత్రివర్గం సిఫారసు చేసిన ప్రొఫెసర్ కోదండరాం కూడా రాజకీయ నాయకుడేనని తెలిపారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.