హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తేతెలంగాణ): అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదాపడింది. జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు విచారించింది.
పిటిషన్లపై స్పందించేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కేంద్రప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేశారు. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల వ్యవహారంపై నవంబర్ 16,17వ తేదీల్లో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్ ధర్మాసనం ప్రకటించింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత వాదనలు వింటామని ధర్మాసనం చెప్పింది.