నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిన కేటీఆర్ అనివార్య కారణాల వల్ల శుక్రవారం కోర్టుకు హాజరుకాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేస్తున్నట్టు జడ్జి శ్రీదేవి ప్రకటించారు. ఈ కేసులో సాక్షులుగా బీఆర్ఎస్ నేతలు ఉన్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ సాక్షాలను సైతం 23న కోర్టు నమోదు చేయనున్నది. కాగా, సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సంజాయిషీ చెప్పుకునేందుకు మంత్రి కొండా సురేఖ 23న కోర్టుకు హాజరుకానున్నారు. అదే రోజు ఆమె కేటీఆర్ పిటిషన్‌పై కూడా సంజాయిషీ ఇచ్చే అవకాశం ఉన్నది.
బీసీ కమిషన్ జిల్లా పర్యటనలు ఖరారు ;రిజర్వేషన్ల ఖరారుపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రజా, కుల సం ఘాల ప్రతినిధుల నుంచి అభ్యర్థనలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ కోసం బీసీ కమిషన్ పర్యటనపై శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. 28 న ఆదిలాబాద్, 29న నిజామాబాద్, 30న సంగారెడ్డి, నవంబర్ 1న కరీంనగర్, 2న వరంగల్, 4న నల్లగొండ, 5న ఖమ్మం, 7న రంగారెడ్డి, 8న మ హబూబ్‌నగర్, 11న హైదరాబాద్ కలెక్టరేట్లలో బహిరంగ విచారణను బీసీ కమిషన్ చేపట్టనుంది. నవంబర్ 11న ప్రత్యేకంగా ఎన్జీవోలు, సంస్థ లు, కుల,సంక్షేమ సంఘాల కోసం, 13న సాధారణ ప్రజల కోసం బహిరంగ విచారణను నిర్వహించనునట్టు వెల్లడించింది. నవంబర్ 13 వరకు వ్యక్తిగతంగా లేదంటే పోస్ట్ ద్వారా, కమిషన్ కార్యాలయంలో అభ్యర్థనలు ప్రత్యేకాధికారికి సమర్పించవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాల www.telangana.gov.in పోర్టల్‌ను సంప్రదించాలని సూచించింది.