దండేపల్లి, అక్టోబర్ 5: అటవీ అధికారు లు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని దమ్మన్నపేట గూ డేనికి చెందిన ఆదివాసీ నాయక్‌పోడ్ గిరిజనులు ఆదివారం తాళ్లపేట అటవీ రేంజ్ కా ర్యాలయం ఎదుట బైఠాయించారు. లింగాపూర్ బీట్‌లోని అటవీ భూముల్లో పోడు సాగు చేసుకుంటున్నామని, అటవీ అధికారులు అకారణంగా కేసులు పెడుతున్నారని వారు ఆందోళన వ్యక్తంచేశారు. కొత్తగా పళ్లైన అమ్మాయిలు, గర్భిణులను సైతం వదలకుండా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరిపై 5 కేసులు బనాయించడమేమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారులు, ఆదివాసీ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. డిప్యూటీ రేంజ్ అధికారి సాగరిక, ఎఫ్ఎస్వో, ఎఫ్‌బీవో, సిబ్బందితో అక్కడికి చేరుకొని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.