UPSC Results : సివిల్స్.. డిగ్రీతోనే ప్రజా సేవలో కీలకంగా వ్యవహరించే పదవిని కట్టబెట్టే వేదిక. అందుకే.. గ్రాడ్యయేట్ పట్టా చేతిలో పడగానే తమ కలల కొలువైన ఐఏఎస్, ఐపీఎస్ దీక్షకు దిగుతారు కొందరు. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, సఫలం కాకున్నా సరే పట్టువదలని విక్రమార్కుల్లా మరో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆదిలాబాద్‌కు చెందిన సాయి చైతన్య జాదవ్(Sai Chaitanya Jadhav) కూడా అలాంటి కుర్రాడే. మంగళవారం యూపీఎస్సీ (UPSC) విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 68వ ర్యాంక్ కొల్లగొట్టాడీ యువకెరటం. తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయం సాధించిన చైతన్య ఏం అంటున్నారంటే..
‘మాది ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోని పల్సిబి గ్రామం. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టాప్ 100లో ఉంటానని అనుకున్నా. కానీ, 68 ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. ఇది నా ఆరో ప్రయత్నం. నా కలల కొలువు కోసం 2019 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. 2023లో ఏపీ క్యాడర్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాను. జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ కొనసాగించాను. అమ్మ కవితా బాయి ప్రభుత్వ స్కూల్లో టీచర్. నాన్న గోవింద్ రావు పోలీస్ కానిస్టేబుల్.
Proud of AIR 131 Sai Chaitanya Jadhav IFS 2024 batch & his father Jadhav Govindrao HC 350 Adilabad District police @TelanganaCOPs who met me today. #Mentored Sai Chaitanya for #interview of #Forest 2024 & Civil 2022 exams. Father worked with me when I was @adilabad_sp ( 2001-4) pic.twitter.com/TgLcE9vqsw
— Mahesh Bhagwat IPS (@MaheshBhagwat95) November 12, 2024
చదవుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వాళ్లను చూసి స్ఫూర్తి పొందిన నేను ఉన్నతోద్యోగం చేయాలనుకున్నా. అనుకున్నట్టే ఐఏఎస్ కాబోతున్నా. ఆదిలాబాద్‌లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలనుకుంటున్నా. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వాళ్లకు నా సలహా ఏంటంటే.. నమ్మకం కోల్పోవద్దు. పట్టుదలగా చదవండి. తప్పకుండా విజయం సాధిస్తారు’ అని చైతన్య తెలిపాడు.