Prabhas | కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో ఆయన స్థాయి అమాంతం పెరిగింది. పాన్ ఇండియా స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్‌ని పలు ఫ్లాపులు పలకరించాయి. అయిన కూడా ప్రభాస్ ఇమేజ్ ఇసుమంత తగ్గలేదు. సలార్, కల్కి చిత్రాలతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్ ఇప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాలనే కసితో ఉన్నాడు. గతంలో ఏడాది ఒక్క సినిమా చేస్తానన్న ప్రభాస్ ఇప్పుడు వరుస పెట్టి చేస్తున్నాడు.
ప్రభాస్ ఖాతాలో చాలా సినిమాలు ఉండడంతో ఇప్పట్లో ఆయన ఫ్రీ అయ్యేలా కనిఇపంచడం లేదు. పలు సినిమాలు సెట్స్ పై ఉండగానే, ప్రభాస్ కొత్త సినిమాలకి ఓకే చెబుతున్నాడు. ప్రభాస్ చేతిలో మొత్తం 9 సినిమాల వరకు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు టాక్ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రముఖ ప్రోడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దర్శకుడు ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు కాని టాప్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తుండగా, ఈ చిత్రం భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగే కథతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే ముందుగా ది రాజా సాబ్ గురించి చెప్పుకోవాలి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫౌజీ.. స్పిరిట్..కల్కి 2898 ఏడీ పార్ట్ 2, సలార్ పార్ట్ 2, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్, కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో సినిమా వీటితో పాటు కేజీఎఫ్ నిర్మాతలు అయిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై దాదాపు మూడు సినిమాలు చేసేందుకు ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడు.. ఇన్ని సినిమాలతో ప్రభాస్ అలరించబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.