ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల టైమింగ్స్ మారాయి. జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల సమయాల్లో మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాల సమయాలను సవరించి, ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగేలా నిర్ణయించారు.
ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు. అన్ని మండల విద్యా శాఖ అధికారులకు, ప్రభుత్వ, ఎల్బీ, కేఏజీబీవీ, మోడల్ హై స్కూళ్లు, అలాగే ప్రైవేటు విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మార్గదర్శకాలను పాటించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, పాఠశాల సమయాల మార్పుల అమలును విద్యాశాఖ పర్యవేక్షించనుందని కలెక్టర్ స్పష్టం చేశారు.