CCI | ఆదిలాబాద్, మార్చి 3 ( నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నది. కార్పొరేట్‌కు అప్పగించే పనుల్లో భాగంగా ఆదిలాబాద్ సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మూతబడిన సీసీఐ యంత్ర సామగ్రిని స్క్రాప్ కింద వేలం వేయడానికి టెండర్లను ఆహ్వానించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సిమెంటుకు డిమాండ్ భారీగా ఉంది. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రారంభించడానికి అన్ని వనరులు ఉన్నాయి. సీసీఐని ప్రారంభిస్తే 2,500 మందికి ప్రత్యక్షంగా, మరో 2,500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీసీఐని ప్రారంభించాలని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. పరిశ్రమ పునఃప్రారంభానికి రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేలను కలిసి అనేకసార్లు వినతిపత్రాలు అందజేశారు. కానీ, మోదీ సర్కారు స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వేలాది మంది ఉపాధిని పట్టించుకోకుండా, స్థానికుల మనోభావాలను లెక్కచేయకుండా పరిశ్రమను కేంద్రం ప్రభుత్వం విక్రయించేందుకు చర్యలు చేపట్టింది.
కేంద్రంలోని మోదీ సర్కారు ఈ పరిశ్రమను అమ్మేందుకు మూడేండ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. మొదటిసారి స్క్రాప్ ఈ-వేలంలో భాగంగా 2022 మే 5న ఆన్లైన్లో బిడ్లను ఆహ్వానించింది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మినహా అన్ని పార్టీల నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పట్లో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. మరోసారి ఈ టెండర్లను కేంద్రం పిలిచింది. ఈ నెల 7 నుంచి టెండర్లను ఆన్లైన్లో దాఖలు చేసుకోవచ్చని సూచించింది. మూతబడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమలో 71 పరికరాలకు సంబంధించి వేలం ప్రారంభ ధర రూ.43.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలియజేశారు. దీంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభించడానికి అన్ని అవకాశాన్నా కేంద్ర ప్రభుత్వం కక్ష్యపూరిత ధోరణిని అవలంబిస్తున్నది. జాతీయ రహదారి-44 ఆనుకొని ఉన్న ఈ పరిశ్రమ నుంచి మహారాష్ట్రతోపాటు ఇతర ఉత్తరాది రాష్ర్టాలకు సిమెంట్ తరలించేందుకు రోడ్డు, రైలు మార్గం అందుబాటులో ఉన్నది. 772 ఎకరాల భూములు, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ నిల్వలూ ఉన్నాయి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్తుతోపాటు నీటి వనరులు ఉన్నాయి. సిమెంటు తయారీకి అపారమైన వనరులున్నా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరితో పరిశ్రమను విక్రయానికి పెట్టడంపై కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్‌తోపాటు ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా పరిశ్రమను పురఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నది. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మూతపడిన ఆదిలాబాద్ సీసీఐని ప్రారంభించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. పరిశ్రమ ప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. సీసీఐ యంత్రాల వేలాన్ని సాధన కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకుంటాం.