హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పశుగణాభివృద్ధి సంస్థలో 23 ఏండ్లుగా పని చేస్తూ సర్కారు అమలు చేసే పథకాలను విజయవంతం చేస్తున్న తమ సేవల్ని గుర్తించాలని గోపాలమిత్రలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గురువారం పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హాను వారు కలిసి వినతి పత్రం అందించారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు తమ పరిస్థితి దయనీయంగా ఉండేదని, సీఎం కేసీఆర్ తమ వేతనాలు పెంచడంతో కొంత మారిందని చెప్పారు. తక్కువ వేతనంతో కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉందని, తమ వేతనాలు పెంచి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రల సంఘం అధ్యక్షుడు చెరకు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.