నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావుకు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించాలంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం ఇప్పటికే భుజంగరావు బెయిల్‌ను మూడుసార్లు పొడిగించిన విషయం విదితమే. ఆయన బెయిల్ గడువు గురువారంతో ముగియనున్నది. దీంతో గురువారం సాయంత్రం 4 గంటల్లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని భుజంగరావుకు 1వ అదనపు జిల్లా జడ్జి రమాకాంత్ స్పష్టం చేశారు. కాగా, ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును అధికారులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్టు 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రకటించారు.