నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ బడుల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మాగనూరు, కృష్ణ మండలాల్లో జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలం ఆకస్మికంగా పర్యటించారు. కేజీబీవీ స్కూళ్లు, మాగనూరు ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం వసతులను పరిశీలించారు. మాగనూరు ఎమ్మార్సీలో పనిచేస్తున్న ఎంఐఎస్ స్వప్న విధులకు గైర్హాజరవుతున్నారని, ఆమె నిర్లక్ష్యంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు సైతం అందలేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్వప్నకు శోకాజ్ నోటీసులు అందజేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.
మాగనూరు కస్తూర్భా బాలికల పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని, మూత్రశాలలు కంపు కొడుతున్నాయని, ఎస్ఓ విధులకు సరిగా హాజరు కాకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నామని విద్యార్థులు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో విచారణకు ఆదేశించారు. కాగా, మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మూడ్రోజులుగా ఏదో ఒక సమస్యతో వార్తల్లోకెక్కుతున్నది. బుధవారం ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా గురువారం కలెక్టర్‌తోపాటు అధికారులు పాఠశాలకు వచ్చి నాణ్యమైన భోజనం అందించాలని సూచించినా పురుగుల అన్నం వడ్డించారు. తాజాగా శుక్రవారం పాఠశాలకు ఎమ్మెల్యే వస్తున్నారంటూ విద్యార్థులకు పస్తులు ఉంచడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా.. మాగనూరు ఉన్నత పాఠశాలలో శుక్రవారం అధికారుల ఎదుటే సాంఘిక సంక్షేమ వసతి గృహం వంట సిబ్బంది మధ్యాహ్న భోజనాన్ని వండారు.
అంతా సిద్ధం చేసినప్పటికీ మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి వస్తున్నారు.. అప్పటివరకు విద్యార్థులకు భోజనం పెట్టొద్దని కాంగ్రెస్ నాయకులు హడావిడి చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం పెట్టాల్సి ఉండగా.. ఇంకా రాలేదు.. దగ్గర్లోనే ఉన్నారు.. వస్తున్నారు.. అంటూ తమ నేత మెప్పు కోసం తాపత్రయపడ్డారు. విద్యార్థులను వదలకుండా తరగతి గదుల్లోనే ఉంచడంతో వారు ఆకలితో అలమటించారు.
ఒంటిగంట సమయంలో ఎమ్మెల్యే పాఠశాలకు చేరుకొన్నారు. ఆఫీస్ రూంలో ఉన్న అదనపు కలెక్టర్ వెంటనే బయటకొచ్చి ఎమ్మెల్యేతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు సమయానికి భోజనం పెట్టారా? లేదా? అని కనీసం పరిశీలించలేదు. విద్యార్థులకు సమయానికి అన్నం పెట్టాల్సిందిపోయి ఎమ్మెల్యే మెప్పుకోసం కాంగ్రెస్ నాయకులు పాకులాడటం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.