Adani-Ponguleti Meeting | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన స్థలాన్ని అదానీకి కట్టబెట్టేందుకు ప్రయత్నం జరుగుతున్నదా? అంటే.. ఔననే సమాధానం వినిపిస్తున్నది. బీజేపీతో సత్సంబంధాలున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ బుధవారం హైదరాబాద్ రావడం, ఐటీసీ కోహినూర్లోని ప్రెసిడెన్షియల్ సూట్ నంబర్ 2122లో గంటకుపైగా మంత్రి పొంగులేటితో రహస్యంగా సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఉన్నట్టు తెలిసింది. అదానీతో భేటీపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు అదానీ కంపెనీగానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ భేటీపై అనేక ఊహాగానాలు బయటకు వచ్చాయి.
దుర్గంచెరువు సమీపంలోని రాయదుర్గం గుట్టపై అత్యంత ఖరీదైన 64 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంపై మంత్రి పొంగులేటిని అదానీ కలిసినట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ (మాజీ ఎమ్మెల్యే కూడా)కి చెందిన సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నట్టు సమాచారం. ఈ విషయం లో కొంత వివాదం ఉండడంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని ప్రభుత్వ భూమిగా పేర్కొన్నా యి. అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్లు దీనిపై విచారణ జరిపి దానిని ప్రభుత్వ భూమిగా తేల్చి నాటి ఏపీఐఐసీ పరిధిలోకి తెచ్చారు. అయితే, ఆ తర్వాత ఆ మాజీ ఎంపీ తన పలుకుబడి ఉపయోగించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన ఓ అధికారి సాయంతో మళ్లీ తమ పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ అధికారి గతంలో హెచ్ఎండీఏలో కూడా పనిచేయడంతో తన పలుకుబడిని ఉపయోగించి ఈ భూమిని అదానీ కోసం మాట్లాడిపెట్టినట్టు చెప్తున్నా రు.
ఈ వివాదాస్పద భూమి ప్రస్తుత మార్కెట్ విలు వ అక్షరాలా ఆరువేల కోట్లని చెప్తున్నారు. ఇంతటి విలువైన భూమిని తెలంగాణ ప్రభుత్వం నుంచి విడిపించి అదానీకి ఇప్పించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. దీని కోసం పాత డాక్యుమెంట్లు, కేసులు, అప్పీళ్లు వంటివాటిని చూపించి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆ నేతకు అప్పగించి, అక్కడి నుంచి అదానీకి అప్పగించే కుట్ర జరుగుతున్నదని, ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అదానీతో కలిసి ఈ భూములను తామే తీసుకునే ప్రయత్నంలో ఉన్నారా? లేక ఆంధ్రప్రదేశ్‌లో తాను పనిచేసిన పాత పార్టీకి చెందిన ఆ మాజీ ఎంపీ కోసం పైరవీ చేస్తున్నారా? అన్న అ నుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఈ భూమికి సంబంధించిన మంతనాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని విడిపించి ఇచ్చే ప్రక్రియ జోరుగా జరుగుతున్నదని మాత్రం చెప్తున్నారు.
అదానీ వాస్తవానికి గురువారం ముఖ్యమంత్రి, ఇతరులతో కూడా సమావేశం కావాల్సి ఉందని తెలిసింది. దావోస్‌లో రేవంత్‌రెడ్డిని కలిసి తెలంగాణలో వ్యాపారం నిర్వహించేందుకు అదానీ ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. ఈమేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. దావోస్ ఒప్పందం తర్వాత అదానీ హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. పొంగులేటితో భేటీ మీడియాలో ముందే రావడంతో కొంత వెనుకడుగు వేసినట్టు చర్చ జరుగుతున్నది. సీఎంతో మాట్లాడేందుకు తొలుత అపాయింట్ ఖరారు అయినప్పటికీ కలువకుండానే వెళ్లిపోయినట్టు చెప్తున్నారు.