CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాలా సహకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, ఆదానీ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎంను కలుసుకొని చర్చలు జరిపారు. అమరరాజా సంస్థ మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టును నెలకొల్పుతున్నది. ఈ పనుల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కంపెనీ సీఎండీ గల్లా జయదేవ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కీలక భాగస్వామి అని అన్నారు. కంపెనీ తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన సహాయసహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు.
తమ ప్రాజెక్టును వేగంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు గల్లా జయదేవ్ సీఎంకు అభినందనలు తెలిపారు. న్యూ ఎనర్జీ, లిథియం అయాన్ బ్యాటరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతోపాటు వివిధ రంగాలలో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్ మారెట్‌కు అనుగుణంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు దివిటిపల్లిలో గిగా కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఇందులో భాగంగా దేశంలోనే పెద్దదైన అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ), లిథియం-అయాన్ బ్యాటరీ తయరీ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నదని అన్నారు. న్యూ ఎనర్జీ పార్, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ యూనిట్, ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ పేరుతో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మొత్తంగా రూ.9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో దాదాపు 4,500 మందికి ప్రత్యక్షంగా, అంతేస్థాయిలో పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్టు అదానీ గ్రూప్ తెలిపింది. పోర్ట్స్ సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరోస్పేస్ సీఈవో ఆశిష్ రాజ్వంశీతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు. అదాని గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందుంటుందని అదానీ గ్రూప్ ప్రతినిధులు చెప్పారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ పారుతోపాటు డాటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసిం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.