బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు. ఇంత వెచ్చించినా సాగులోకి వచ్చే కొత్త ఆయకట్టు అత్యల్పమే. దానికి తోడు ప్రతిపాదిత ఆయకట్టుకు ఇప్పటికే కృష్ణా నుంచి నీరందుతున్నది. ఇంకోవైపు ప్రాజెక్టుకు కేంద్ర సంస్థలే అనుమతులు నిరాకరిస్తున్నాయి.
బనకచర్ల కోసం ఎందుకీ తాపత్రయం?
రెండు రాష్ర్టాల్లో బనకచర్ల ముసలం కొనసాగుతున్నది. ఇంటాబయటా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. అయినప్పటికీ ఏపీ సర్కారు దూకుడు మాత్రం తగ్గడం లేదు. బనకచర్ల నీటి హక్కులకు తీవ్ర విఘాతమని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి చెవినపెట్టడం లేదు.
కార్పొరేట్ గూడుపుఠాణిలో భాగంగానే పావులు కదులుతున్నాయి. అదానీ విద్యుత్తు ప్రాజెక్టుల కోసమే బనకచర్లకు బాట పడు తున్నది. కేంద్రం కథ నడిపిస్తున్నదంటేనే లోగుట్టు అర్థమవుతున్నది. ఆయకట్టు పెంపు పైకి చెప్తున్న మాట. అసలు విషయం మాత్రం హైడ్రోపవర్ కోసం పవర్ గేమ్!
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : గోదావరి నది నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచర్లకు మళ్లించి కరువు పీడిత ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది. దాదాపు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. దీనికి నిధులు సమకూర్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సైతం సంసిద్ధత వ్యక్తంచేస్తున్నది. అనుమతుల మంజూరు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. అయితే, ఏపీ చెప్తున్నట్టుగా ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు ఏమీ ఉండదు. లింక్ ప్రాజెక్టులో ప్రతిపాదించిన ఆయకట్టుకు ఇప్పటికే సాగునీరు అందుతున్నది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి, కేసీ కెనాల్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్, ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడి కాలువ) మల్యాల, ముచ్చుమర్రి తదితర లిఫ్ట్‌లతో ఇప్పటికే పెన్నా బేసిన్‌కు ఏపీ భారీగా కృష్ణా జలాలను మళ్లిస్తున్నది. వివిధ ప్రాజెక్టుల రూపేణా పెన్నా బేసిన్లోనే దాదాపు 350 టీఎంసీల స్టోరేజీ సామర్థాన్ని ఏపీ కలిగి ఉన్నది. మరెందుకు ఇంత వ్యయం తో బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నట్టు? దీనికి కనిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కోసమే! పెన్నా బేసిన్లో ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులతో ఏపీ భారీగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. వాటిని మరింతగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది. ఆ ప్రాజెక్టులకు కావాల్సిన నీటి కోస మే జీబీ లింక్‌ను చేపడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇందులో మోదీ సన్నిహితుడి కంపెనీలు ఉన్నందునే కేంద్రం ఉత్సాహం చూపుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ (పీఎస్హెచ్పీ) అనేది కృత్రిమమైన జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం. ఇందులో వేర్వేరు ఎత్తుల్లో అంటే ఎగువన ఒకటి, దిగువన ఒకటి రెండు జలాశయాలను నిర్మిస్తారు. ఆ రెండు జలాశయాల మధ్య రివర్సబుల్ పంప్ టర్బైన్లు, జనరేటర్లు, ఇతర అనుబంధ వ్యవస్థలతో కూడిన పవర్‌హౌస్‌ను ఏర్పాటుచేస్తారు. నీటి సరఫరా వ్య వస్థతో దీనిని అనుసంధానం చేస్తారు. ఎగువనుంచి నీటిని దిగువకు విడుదల చేస్తూ జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు దిగువనున్న జలాశ యం నుంచి ఎగువనున్న జలాశయానికి నీటి ని తిరిగి ఎత్తిపోస్తారు. విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థను గ్రిడ్‌తో అనుసంధానం చేస్తారు. పీఎస్హెచ్పీల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును యూనిట్‌కు రూ.2.5 నుంచి డిమాండ్‌ను బట్టి ఇంకా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. సూటిగా చెప్పాలంటే ఇవి కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల వంటివే. అయితే, ఆ రెండింటిని నదీపైనే నేరుగా ఏర్పాటుచేశారు. పీఎస్హెచ్పీలను మాత్రం కృత్రిమంగా నిర్మించిన నీటివనరులపై ఏర్పాటు చేస్తారు.
పెన్నా నది లోటు బేసిన్. ఈ బేసిన్లో ఏటా సగటు నీటిలభ్యత 78 టీఎంసీలే. అయినప్పటికీ, ఇప్పటికే ఏపీ సర్కారు 130 టీఎంసీలతో పలు ప్రాజెక్టులను చేపట్టింది. ఈ పెన్నా బేసిన్లోనే పదుల సంఖ్యలో భారీ రిజర్వాయర్లను నిర్మించింది. పెన్నా బేసిన్లో 350 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఏపీకి ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు. ఏటా కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా మ ళ్లించుకుంటున్నది. 200 టీఎంసీల సామర్థ్యంతో పలు ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్న ది. పెన్నాబేసిన్లో ఉన్న భౌగోళిక పరిస్థితి పీఎస్హెచ్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైనది. సోమశిల జలాశయ ప్రాంతాన్ని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కీలకమైన ప్రదేశంగా పరిగణిస్తున్నారు. దీంతో ఏపీ భారీగా ఇక్కడే పీఎస్హెచ్పీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నది. రూ.44 వేల కోట్ల పెట్టుబడులతో మొత్తంగా 29 పీఎస్హెచ్పీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించగా, అందులో 18 దాకా పెన్నా బేసిన్లోనే ఉండటం గమనార్హం. ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు పలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోగా, పలు ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. రాబోయే రెండు మూడేండ్లలో ఆయా ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.
పెన్నా బేసిన్లో ఏర్పాటు చేస్తున్న పీఎస్హెచ్పీ ప్రాజెక్టుల్లో ఎక్కువగా అదానీ, గ్రీన్కో కార్పొరేట్ కంపెనీలకు చెందినవే ఉన్నాయి. అదానీ గ్రీన్ఎనర్జీ లిమిటెడ్ ఏపీలో మొత్తం ఐదు ప్రాజెక్టులను చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నది. అందులో నాలుగు పెన్నా బేసిన్లోనే ఉన్నాయి. గండికోట రిజర్వాయర్‌ను ఆధారంగా చేసుకుని కడప జిల్లా కొండాపురం మండలంలోని బొమ్మేపల్లి, నేననూతల గ్రా మాల సమీపంలో 1,000 మెగావాట్లు, సోమశిలపై 900 మెగావాట్లు, చిత్రావతిపై 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లను ఏపీ నెలకొల్పనున్నది. వీటితోపాటు అనంతపురం జిల్లాలో మరో 800 మెగావాట్ల పీఎస్హెచ్పీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ నాలుగు ప్రాజెక్టుల విలువ రూ.11వేల కోట్లు. వీటితోపాటు ఏపీ ప్రభుత్వంతో కలిసి మరో 1,950 మెగావాట్ల ప్రాజెక్టును యాగంటిలో ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నది. గ్రీన్కో కంపెనీ పిన్నాపురం వద్ద 1,650 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటుచేస్తున్నది. ఇప్పటికే గోరకళ్లపైన 11 కి.మీ దూరంలో ఎత్తిపోసేందుకు 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించింది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ల పేరుతో 1,200 మెగావాట్ల విద్యుత్తు తయారీకి ఏర్పాటుచేస్తున్నది. దాదాపు ఈ ప్రాజెక్టులన్నింటినీ 2026 నుంచి 2028 నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలే కాకుండా ఏపీ సర్కారు సైతం సొంతంగా పలు పీఎస్హెచ్పీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
పెన్నాలో నీటి లభ్యత లేదు. ఏటా అక్రమంగా కృష్ణా నుంచి నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ మళ్లిస్తున్నది. అయితే, పీఎస్హెచ్పీ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీటి భరోసాను కల్పించేందుకు ప్రస్తుతం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. కృష్ణా నుంచి మళ్లిస్తున్న జలాలను ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టుకు అందిస్తున్నారు. రేపటిరోజున ఆ నీటిని పీఎస్హెచ్పీలకు తరలిస్తే సాగునీటికి లోటు ఏర్పడే అవకాశం ఉన్నది. పంట పొలాలకు ఇవ్వకుం డా ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తే, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో బనకచర్లను ముందుకు తీసుకుపోతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటివరకు కృష్ణా జలాలతో కొనసాగుతున్న పీఎస్హెచ్పీలు రేపటిరోజున గోదావరి నుంచి మళ్లించే జలాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసి సొమ్ము చేసుకుంటాయన్న మాట. గోదావరి మళ్లింపునకు అనుగుణంగా తెలుగుగంగ, పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీని, హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ-నీవా సుజల స్రవంతి), జీఎన్ఎస్ఎస్ (గాలేరు-నగరి సుజల స్రవంతి), మల్యాల, ముచ్చుమర్రి తదితర కాలువలన్నింటినీ అధిక మొత్తంలో నీళ్లను తరలించేందుకు వీలుగా విస్తరిస్తున్నారు. పలు కాలువలను పొడిగిస్తూ పీఎస్హెచ్పీ ప్రాజెక్టుల్లో భాగమైన రిజర్వాయర్లతో అనుసంధానం చేస్తున్నారు.
ఒకవైపు సాగు, తాగునీటి కోసం రైతులు అల్లాడుతుంటే.. బేసిన్‌లోని పంట భూములు పడావు పడుతుంటే.. మరోవైపు ఏపీ మాత్రం పీఎస్హెచ్పీల కోసం తహతహలాడుతున్నది. కృష్ణా బేసి న్ నుంచి జలాలను అక్రమంగా ఏటా పెన్నాకు తరలిస్తున్నది. పీఎస్హెచ్పీలకు సంబంధించిన ఒప్పందాలన్నీ గత సంవత్సరం దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో జరిగిపోయాయి. అదానీ కంపెనీ అక్కడే ఏపీ సీఎంతో ఒప్పందాలు చేసుకున్నది. గ్రీన్కో కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా పలు అగ్రిమెంట్లు చేసుకున్నది. పెన్నా బేసిన్‌లోని పీఎస్హెచ్పీలకు నీటిలభ్యతను సమకూర్చడం కోసమే బనకచర్లను హడావుడిగా ఏపీ ముందుకు తీసుకొస్తున్నది. ఆయా కంపెనీలతో లోపాయికారీ ఒప్పందాల నేపథ్యంలో సీఎం రేవంత్ సైతం బనకచర్ల ప్రాజెక్టుకు మొగ్గుచూపుతున్నారనే విమర్శలున్నాయి. బనకచర్ల లింక్ ప్రాజెక్టు కోసం కేంద్రం 70% నిధులు సమకూర్చేందుకు భరోసా ఇవ్వడం వెనక కూడా అదానీ కంపెనీ ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేంద్రప్రభుత్వం ఒకవైపు, ఏపీ మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ హడావుడి చేస్తుండటం కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమేననే విమర్శలొస్తున్నాయి.