Gautami | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4: ‘నా బిడ్డ కోసం క్యాన్సర్‌ను జయించా.. మొదటి స్టేజీలోనే గమనించి సరైన చికిత్స తీసుకున్నా.. మానసికంగా, దృఢంగా ఉండి ఎదుర్కొన్నా’ అని సినీనటి గౌతమి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
20 సంవత్సరాల క్రితం ఫిబ్రవరిలోనే క్యాన్సర్ వచ్చిందని గుర్తుచేశారు. అప్పుడు 32 ఏళ్లు, చిన్న పాప ఉంది. మానసిక ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యమని వైద్యులు సూచించారని చెప్పారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే రోగాలు రావని సూచించారు. అంతకుముందు క్యాన్సర్ వాకథాన్‌ను సినీ నటి గౌతమి, ఎంపీ కావ్య జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యురాలు డాక్టర్ హరిణి, ప్రతిమ ఇనిస్టిట్యూట్ చైర్మన్ రమేశ్, డైరెక్టర్లు పాల్గొన్నారు.