(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): బెంగళూరు రేవ్ పార్టీ కేసు కొత్త మలుపులతో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నది. నిన్నటివరకూ తాను పార్టీకి వెళ్లలేదని వీడియోల్లో బుకాయించిన తెలుగు సినీ నటి హేమ పార్టీకి వెళ్లడమే కాదు మాదకద్రవ్యాలనూ (డ్రగ్స్) సేవించినట్టు తేలింది. అసలు పేరు కృష్ణవేణిగా అక్కడి రిజిస్టర్లో రాసినందన ఎవరూ గుర్తు పట్టరని ఆమె తొలుత ఖండించారు.
ఇదే విషయాన్ని గురువారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచి (సీసీబీ) పోలీసులు వెల్లడించారు. టాలీవుడ్‌కు చెందిన మరో నటి ఆషీరాయ్ కూడా పార్టీకి హాజరైనట్టు తెలిపారు. అయితే ఆమె డ్రగ్స్ తీసుకున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నట్టు పేర్కొన్నారు. పార్టీకి హాజరైన 103 మంది రక్త నమూనాలను నార్కొటిక్ పరీక్షలకు పంపగా, ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వివరించారు.
వారందరికీ నోటీసులిచ్చి విచారణకు పిలుస్తామని తెలిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు కోర్టు నుంచి సెర్చ్ వారెంటు తీసుకున్నాకే ఆదివారం జీఆర్ ఫామ్‌హౌజ్‌లో జరుగుతున్న పార్టీపై దాడులు జరిపామని, తాము వెళ్లే సమయానికి నృత్యాలు చేస్తూ, తాగుతూ కొందరు మత్తులో తూలుతున్నారని పోలీసులు తెలిపారు. అదేరోజు పార్టీలో 17 ఎండీఎంఏ మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ బయటపడటంతో, ఈ పార్టీ నిర్వాహకులు సెక్స్ రాకెట్‌ను కూడా నిర్వహిస్తున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్టు చేశారు.
పూరింటి నుంచి విల్లాకు
లంకపల్లి వాసు అనే వ్యక్తి ‘సన్‌సెట్-సన్‌రైజ్’ పేరిట ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. నిందితుల జాబితాలో ఇతడిని ఏ1గా చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వన్‌టౌన్‌లోని ఆంజనేయవాగు కొండపై గతంలో ఒక పూరింట్లో వాసు కుటుంబం నివాసం ఉండేదని స్థానికులు చెప్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల్లో పూర్తిపట్టు సాధించిన వాసు.. తక్కువకాలంలోనే కోట్లు సంపాదించి, ఇండ్లు, విల్లాలను కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. అయితే, రేవ్‌పార్టీలో డ్రగ్స్‌తోపాటు తారలు పట్టుబడటంతో వాసుకు సినీ ఇండస్ట్రీతోపాటు డ్రగ్స్ సరఫరా ముఠాతోనూ దగ్గరి పరిచయాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
పార్టీలో పేరు మార్చుకున్న హేమ
బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ, తాను వెళ్లలేదని నటి హేమ ధైర్యంగా పలు వీడియోలు విడుదల చేసింది. దీనికి కారణం పార్టీ హాజరుపట్టికలో ఆమె తన పేరును కృష్ణవేణిగా పేర్కొనడమేనని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సినిమాల్లోకి రాకముందు హేమ అసలు పేరు కృష్ణవేణి. ఇదే పేరును డ్రగ్స్ పార్టీ రిజిస్టర్లో పేర్కొన్నది. తర్వాత హేమ ఫొటోలను చూసిన వారు ఆమె ఎవరో గుర్తుపట్టడం, విమాన ప్రయాణ టికెట్లను పోలీసులు బయటపెట్టడంతో అసలు విషయం బయటపడింది. అలాగే, పోలీసులు విడుదల చేసిన హేమ ఫొటోలోని డ్రెస్, ఆమె విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ ఒకేవిధంగా ఉండటంతో ఆమె పార్టీకి వెళ్లినట్టు తేలింది. ఆ పార్టీకి హాజరయ్యే వారికి ఎంట్రీ ఫీజుగా రూ.2 లక్షలను నిర్వాహకులు వసూలు చేసినట్టు సమాచారం.