కరీంనగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆవిర్భవించిన ఎనిమిదేండ్లలోనే ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న తెలంగాణను నడిపించే చోదకశక్తులపై కేంద్రానికి కన్నుకుట్టింది. లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రానైట్ రంగాన్ని దెబ్బతీయాలనే కుట్రతోనే కరీంనగర్ కేంద్రంగా గ్రానైట్ ఏజెన్సీలపై ఈడీ రైడ్స్ సాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముప్పేట దాడిచేసి గ్రానైట్ పరిశ్రమలను మూతపడేలా చేయటమే ఈ దాడుల వెనుక ఉద్దేశమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 30 ఏండ్ల క్రితం గ్రానైట్ వ్యాపారం ప్రారంభమైంది. ప్రస్తుతం 200కుపైగా క్వారీలు, 400కు పైగా కటింగ్ యంత్రాలు నడుస్తున్నాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది వరకు ఉపాధి పొందుతున్నారు. క్వారీల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 250 కోట్లకుపైగా రాయల్టీ రూపంలో సమకూరుతున్నది. రూ.450 కోట్ల వరకు జీఎస్టీ చెల్లింపులు జరుగుతున్నాయి.
పక్కాగా లెక్కలు
క్వారీల్లో వెలికితీసిన గ్రానైట్‌ను మైనింగ్ అధికారులు కొలత వేసి పన్ను విధిస్తారు. డబ్బు చెల్లించాక అనుమతి పత్రాలు ఇస్తా రు. తర్వాత వాణిజ్య పన్నులశాఖ నుంచి రవాణా అనుమతి పత్రాలు జారీఅయ్యాక వే బ్రిడ్జిల్లో తూకం వేసి రైల్వేస్టేషన్లకు చేరుస్తారు. రైల్వే అధికారులు తిరిగి వే బ్రిడ్జిపై కొలిచాకే రసీదు ఇస్తారు. అక్కడి నుంచి ఓడరేవుకు చేరాక నౌకల ద్వారా రవాణాచేసే ఖనిజాన్ని తిరిగి వేమెంట్ చేసి షిప్పింగ్ బిల్, బిల్ ఆఫ్ లోడింగ్ జారీచేస్తారు. ఈ ప్రక్రియ తర్వాతే గ్రానైట్ ఖనిజం ఇతర దేశాలకు రవాణా అవుతుంది.
ఇదీ వివాదం..
2011 మే 9న కాకినాడ పోర్టులో మైనింగ్ అధికారులు అనుమతించిన మెటీరియల్‌కు, పోర్టులో ఉన్న మెటీరియల్‌కు కొలతల్లో తేడాలున్నట్టు అప్పటి ఉమ్మడి ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గుర్తించారు. తేడా విలువలను చెల్లించాలంటూ కరీంనగర్ నుంచి సరఫరా చేసిన 9 గ్రానైట్ ఎగుమతి ఏజెన్సీలకు నోటీసులు జారీచేశారు. మైనింగ్ నిబంధనల ప్రకారం1+1 పద్ధతిలో అపరాధ రుసుం చెల్లించారు. 2008 నుంచి 2011 వరకు కరీంనగర్, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వేస్టేషన్ల ద్వారా కాకినాడ పోర్టుకు రవాణా చేసిన గ్రానైట్ మెటీరియల్ వివరాలను సేకరించి 9 ఏజెన్సీలకు అపరాధరుసుంతో కలిపి 1+5 పద్ధతిలో చెల్లించాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఏజెన్సీలు ప్రభుత్వాన్ని ఆశ్రయించగా రాఘవాపూర్ నుంచి సరఫరా అయిన ఖనిజానికి 1+1 పద్ధతిలో చెల్లించాలనటంతో ఆ మేరకు చెల్లింపులు చేశారు. కరీంనగర్ స్టేషన్ నుంచి సరఫరా అయినా గ్రానైట్‌కు కూడా కొన్ని ఏజెన్సీలు డబ్బు చెల్లించగా కొన్ని ఏజెన్సీలు నోటీసులను చాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా విచారణ కొనసాగుతున్నది. ఇవేకాకుండా మరో రూ.124 కోట్లకు ఐదు రెట్ల అపరాధ రుసుం కలిపి రూ.750 కోట్లు చెల్లించాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో చూపిన రూ.124 కోట్లలో రూ.70 కోట్లు ముందుగానే చెల్లించామని, మినహాయించకుండా మళ్లీ నోటీసులు ఇవ్వటంపై ఏజెన్సీలు న్యాయపోరాటం చేస్తున్నాయి. రాష్ట్ర మైనింగ్ శాఖ దీనిపై మదింపు చేస్తున్నదని, తేడాలు వస్తే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని 230 గ్రానైట్ క్వారీ యజమానులు ప్రకటించారు.
ఫిర్యాదులతో దెబ్బతీసే కుట్ర
కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 2019 జూలై 19న అప్పటి కేంద్ర మైన్స్ అండ్ మినరల్స్ మంత్రి ప్రహ్లాద్‌జోషికి ఈ విషయంపై ఫిర్యాదుచేశారు. 2019 జూలై 31న పోర్ట్స్, షిప్పింగ్శాఖ మంత్రికి, అర్థికమంత్రి నిర్మల, హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత పేరాల శేఖర్‌రావు 2021 జనవరి 11న పలువురు మంత్రులకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుచేశారు. కొంతమంది రాయల్టీ ఎగవేశారని, మరికొందరు ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారంటూ బీజేపీ ఫిర్యాదుల పరంపర సాగుతూనే ఉన్నది. వాస్తవానికి గనులు, ఖనిజ వనరుల అంశం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిమానా విధించినా, తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాపారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ కోణంలోనే ప్రస్తుతం ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదని, ఇదంతా బీజేపీ కుట్రేనని ఓ గ్రానైట్ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.