కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క ఆదివారం జిల్లాలో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కార్యక్రమాల్లో పలువురు ప్రొటోకాల్ లేని వ్యక్తులకు అధికారులు ప్రాధాన్యమిచ్చారు. దీనిని నిరసిస్తూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధర్నా చేపట్టారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ జెండాలు ప్రదర్శించడం, అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్‌ను అధికారిక కార్యక్రమాలకు అహ్వానించడం, ప్రారంభోత్సవాలు చేయించడంపై ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధ్వజమెత్తారు. కనీసం ప్రొటోకాల్ గురించి తెలియని సీతక్క మంత్రి ఎలా అయ్యారోనని ఎద్దేవా చేశారు. అధికారులు ఇక ముందు ప్రొటోకాల్ గురించి తెలుసుకొని ప్రవర్తించాలని సూచించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుకు వినతిపత్రం అందజేశారు.