హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. హైదరాబాదులోని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో సోమవారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ హనుమంతునాయుడు, కేశవులు తదితరులు సమావేశమయ్యారు. పాలమూరు ప్రాజెక్ట్ 85 శాతం పూర్తయిందని, ఐదు రిజర్వాయర్లు 85 శాతం పూర్తయ్యాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. 15 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నట్టు, కాలువల టెండర్లు పిలిచారని అన్నారు.
నార్లపూర్ వద్ద పంప్‌హౌస్ ట్రయల్న్ చేశారని చెప్పారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తే మహబూబ్‌నగర్ పచ్చబడుతుందని, 15 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని అన్నారు. పాలమూరు వలసలు పూర్తిస్థాయిలో ఆపాలంటే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అభిప్రాయపడ్డారు. నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, పంపులతో రిజర్వాయర్లు నింపుకున్నా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు ఆగామని,ఇక కలిసి వచ్చే నాయకులతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తామని నేతలు స్పష్టంచేశారు. పార్టీలకు అతీతంగా పాలమూరు ప్రాజెక్ట్ కోసం అందరు కలిసి రావాలని, అందరినీ సమన్వయము చేసే విధంగా కార్యాచరణ ఉంటుందని వారు వివరించారు.