హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : కొందరి డైరెక్షన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కావాలనే బురద జల్లేందుకు మహాన్యూస్ చానల్ అసత్య కథనాలను ప్రసారం చేసిందని, ఆ చానల్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆదివారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమ టీవీ రేటింగ్ కోసం దిగజారుడు కథనాలను వండి వార్చిందని మండిపడ్డారు. మీడియా ముసుగులో ఇలా దుష్ప్రచారం చేయడం జర్నలిజం అనిపించుకోదని, ఆ చానల్ చర్య అనైతికమని విమర్శించారు. కేవలం రాజకీయ ప్రతీకార చర్యకోసం కొందరు మహిళలను ఇందులోకి లాగి, మహిళల హక్కులను, వారి గౌరవ మర్యాదలను సైతం తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అడ్డం పెట్టుకొని నకిలీ వార్తలను ప్రసారం చేస్తున్న మహాన్యూస్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
షర్మిలమ్మా..ఇదేం ద్వంద్వనీతి? ; నీచమైన ప్రచారం చేసిన చానల్‌కు మద్దతు ఎందుకు?: సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేసిన టీవీ చానల్‌ను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెనుకేసుకురావడంలో ఆంతర్యమేంటని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రాలో అడుగుపెట్టగానే షర్మిల గతం మర్చిపోయి స్వరం మార్చడమేంటని ఎక్స్ వేదికగా నిలదీశారు. గతంలో షర్మిలకు ఓ నటుడితో సంబంధం అంటగట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై బీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకుని, షర్మిలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పుడు కేటీఆర్‌ను ఉద్దేశించి నీచమైన దుర్మార్గానికి ఒడిగట్టిన చానల్‌కు షర్మిల వంతపాడడం విడ్డూరమని చెప్పారు.