 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్య లు తీసుకోవాలని వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ), నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్‌ను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) గురువారం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ కళాశాలల అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’తో పాటు ఇతర పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఎన్‌హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు.
సరైన మౌలిక వసతులు, అధ్యాపకులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యవర్తుల ద్వారా అధికారులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. . ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్‌హెచ్చార్సీ తక్షణమే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. బాధ్యులైన అధికారులు, మధ్యవర్తులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది.
 
                            