కరీంనగర్: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ , పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నూతనంగా ఎంపికైన జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నూతన కమిటీ దళితులకు , ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని, దళితులకు న్యాయం జరిగేలా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
దళితబంధు కింద వచ్చిన యూనిట్లను అమ్ముకోవడం, లీజ్ కిచ్చినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటా మన్నారు. దళితబంధు పథకం కోసం దళారులను ఆశ్రయించి వారికి డబ్బులు చెల్లించినట్లుగా తెలిస్తే వారికి దళితబంధును రద్దు చేస్తామన్నారు. నూతన కమిటీ రాజ్యాంగబద్ధంగా పని చేయాలి సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా దళితుల పై వివక్ష కొనసాగడం బాధగా ఉందన్నారు.
గత పాలకుల హయాంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.