హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఒక అపూర్వ ఘట్టం. దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా దశాబ్దాలపాటు ప్రజాస్వామ్యయుతంగా, ఏమాత్రం దారితప్పకుండా సాగిన ఉద్యమం బహుశా ప్రపంచంలో ఇదొక్కటే. స్వరాష్ట్రం కోసం వేలమంది తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వందలమంది తెలంగాణ మేధావులు తమ ప్రసంగాలు, ఉద్యమాల ద్వారా 60 ఏండ్లపాటు తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో సజీవంగా ఉంచారు. దానికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి, అప్పటివరకు మేధో, విద్యార్థి ఉద్యమంగా ఉన్న తెలంగాణ ఆకాంక్షను ప్రజా ఉద్యమంగా మార్చి.. ఢిల్లీపై దండెత్తారు. భారత ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి తెలంగాణ రాష్ర్టాన్ని బాజాప్తా సాధించారు.
ఈ విషయం తెలంగాణలో స్కూలు పిల్లవాడిని అడిగా చెప్తాడు. కానీ, కాంగ్రెస్ వాళ్లకు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వేసిన భిక్షనట! తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు బాధపడుతుంటే.. సోనియాగాంధీ భిక్ష వేశారట. ఈ మాటలన్నది అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ సతీమణి అనురాధ. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘మనం ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోటి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకొన్నాం. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకొంటే.. దాన్ని చూడలేక మన తల్లి సోనియాగాంధీ ఇచ్చిన భిక్ష ఈ తెలంగాణ రాష్ట్రం’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పేగులు తెగేలా ఉద్యమం చేసి సాధించుకొన్న తెలంగాణను భిక్ష అంటారా? అని మండిపడుతున్నారు. సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.