రాజన్న సిరిసిల్ల గాంధీచౌక్, జూన్ 17: బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 7వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బీ నవీన్‌కుమార్ (27)కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో 2019 మార్చి 13న బాలికను అపహరించాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.
అనంతరం 2020 డిసెంబర్ 4న నిందితుడు బాలికను ఆమె ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయాన్ని బయటపెడుతుందని విషం తాగించాడు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాడు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన వేములవాడ టౌన్ పోలీసులు.. సాక్షుల వాంగ్మూలాలు, శాస్త్రీయ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు.
దీంతో నిందితుడిపై నేరాలు రుజువైనట్టు నిర్ధారించిన న్యాయస్థానం, ఈ మేరకు నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 7వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో నిందితుడికి శిక్షపడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టిన అప్పటి డీఎస్పీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ వెంకటేశ్, కోర్టు కానిస్టేబుళ్లు మహేందర్, లతీఫ్, నవీన్, వెన్నెలను ఎస్పీ మహేశ్ బిగితే అభినందించారు.