హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన నిందితులు న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చుకుంటున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ కేసులో కోర్టును యుద్ధభూమిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను యుద్ధక్షేత్రాలుగా మార్చుకునే ప్రయత్నాలను ఉపేక్షించబోమని హెచ్చరించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ కోవకు చెందిన కేసులు ఎకువగా ఉంటున్నాయని తెలిపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో హైకోర్టు తమను రిమాండ్‌కు పంపడాన్ని సవాల్ చేస్తూ.. నిందితుడు రామచంద్ర భారతి అలియాస్ సతీశ్‌శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టుల్లో కేసులు వేస్తే ఎలా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. కోర్టులను యుద్ధక్షేత్రాలుగా ఎంచుకునే ప్రయత్నాలు ఫలించబోవని, అలాంటి కేసులను ఉపేక్షించబోమని హెచ్చరించింది.
రాజకీయాల కోసం కోర్టులను వేదికగా చేసుకోవడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. నిజానికి ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసును సీబీఐకి అప్పగించాలంటూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ రిట్ దాఖలు చేయడంపై గత విచారణ సమయంలోనే సుప్రీంకోర్టు సందేహాలను వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు చెందిన క్రిమినల్ కేసులో ఒక రాజకీయ పార్టీకి సంబంధం ఏమిటని, బీజేపీ దాఖలు చేసిన కేసును హైకోర్టు ఏవిధంగా విచారణ జరిపిందని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో బీజేపీ దాఖలు చేసిన రిట్‌పై విచారణ ఏమైందని ధర్మాసనం ఆరా తీసింది.
హైకోర్టులో విచారణ జరుగుతున్నదని, నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కూడా విచారణ చేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా జవాబు చెప్పారు. నిందితులకు సంబంధించి బీజేపీ దాఖలు చేసిన కేసు విచారణ హైకోర్టులో ఉన్నదని తెలిపారు. ఒకవైపు నిందితులతో తమకు సంబంధం లేదంటూనే బీజేపీ దాఖలు చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయని వివరించారు. దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ స్పందిస్తూ.. హైకోర్టులో బీజేపీ వేసిన కేసుకూ, సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తికి (రామచంద్ర భారతి) సంబంధం లేదని చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు రాజకీయాలకు కోర్టులను వేదికలుగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
పలు సందర్భాల్లో తెలంగాణ, ఏపీల నుంచి వస్తున్న కేసుల్లో రాజకీయ వివాదాలతో ముడిపడినవే ఎకువ ఉంటున్నాయని, అందులో ఇదొకటని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కల్పించుకుని, హైకోర్టులో బీజేపీతోపాటు ఇతరులు వేసిన కేసులు పరిషారమయ్యే వరకు సుప్రీంకోర్టు కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.