దుండిగల్, ఏప్రిల్ 23: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డిఎవెన్యూకు చెందిన పిచెట్టి వరప్రసాద్, పద్మజరాణి దంపతుల చిన్నకుమారుడు వంశీకృష్ణ(23) 2021లో అమెరికా వెళ్లి కార్బండేల్ టౌన్‌లోని సదరన్ ఇల్లినాయి యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈ నెల 21న ఉదయం 7.15 (అమెరికా కాలమానం ప్రకారం) గంటలకు వంశీకృష్ణతోపాటు ఖమ్మంకు చెందిన పవన్ స్వర్ణ(23), మరో ముగ్గురు స్నేహితులు కారులో సమీపంలోని పట్టణానికి వెళ్లి షాపింగ్ చేసుకొని తిరిగి వస్తున్నారు.
మార్గమధ్యంలో వీరి కారును ఓవర్టేక్ చేసే క్రమంలో మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్న మహిళతోపాటు వంశీకృష్ణ, పవన్ స్వర్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను అక్కడి అధికారులు తానా ప్రతినిధులకు అప్పగించారు. సోమవారం సాయంత్రానికి మృతదేహాలు హైదరాబాద్‌కు చేరుకొనే అవకాశం ఉన్నది. వరప్రసాద్ కూకట్పల్లి యాక్సిస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య పద్మజారాణి జేఎన్టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు శశికిరణ్ ఏడేండ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.